ముఖం నిండా ఇష్టం వచ్చినట్టుగా ఒక పద్ధతి పాడు లేకుండా కొబ్బరి పీచు లాంటి వెంట్రుకలు, ఎదుటి వాళ్ళని వెక్కిరిస్తున్నట్టుగా బయటకు వచ్చి ఒక వైపు వాలిపోయిన నాలుక, అనారోగ్యంతో చచ్చు పడిపోయిన వెనుక కాళ్లు. ఈ రకంగా మీరు ఒక కుక్క(Dog)ని ఊహించుకుంటే దానిని అస్సలు ప్రేమించలేరు. కానీ నిజానికి అలా అంద వికారంగా ఒక కుక్క ఉంది. ఆ కుక్కకి అందం లేకపోవడమే వరంగా మారింది. అదే దానికి లక్ష రూపాయల ప్రైజ్ మనీ, ఒక ట్రోఫీ తీసుకువచ్చింది.
గత 50 ఏళ్లుగా కాలిఫోర్నియా(California)లో వరల్డ్ అగ్లీయస్ట్ డాగ్(World Ugliest Dog)అనే పోటీలను నిర్వహిస్తున్నారు. అందం లేకపోయినా ఈ కుక్కలు తన వైకల్యాన్ని అధిగమించి సంతోషంగా జీవిస్తున్నాయని చెప్పడమే నిర్వాహకుల లక్ష్యం. అంతేకాదు ఇలాంటి కాంపిటీషన్లో వల్ల అందవికారమైన కుక్కలను కూడా ఎవరో ఒకరు ప్రేమతో దగ్గరకు తీసుకుంటారు ఈ విధంగా వాటి జీవితంలో ప్రేమని, ఆనందాన్ని నింపటమే ఈ కాంపిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం.
2023 వరల్డ్ అగ్లీయస్ట్ డాగ్ పోటీలలో గెలిచిన ఈ కుక్క పేరు స్కూటర్(Scooter). నిజానికి ఇది ఏడేళ్ల వయసున్న చైనీస్ క్రెస్టెడ్ బ్రీడ్ కు చెందినది. ఇది పుట్టుకతోనే వికారంగా జన్మించింది. పాపం ఎవరు దత్తత తీసుకోకపోవడంతో రెస్క్యూ గ్రూప్ కి చెందిన ఒక వ్యక్తి దీని ఆలనా పాలనా చూసుకున్నాడు. ఏడు సంవత్సరాల పాటు ఏ లోటూ లేకుండా పెంచాడు. అయితే ఒకానొక సమయంలో స్కూటర్ ఆరోగ్యాన్ని సంరక్షించడం దత్తత తీసుకున్న వ్యక్తికి ఆర్థికంగా భారమైంది. దీంతో స్కూటర్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించే లిండానే దీనిని దత్తత తీసుకుంది. అప్పటినుంచి మరింత ప్రేమతో చూసుకుంటుంది ఫిజియో ఫిథియో థెరపిస్టుల సలహా మేరకు దీనికి ఒక కార్ట్ తయారు చేయించి పెట్టింది. దాని సహాయంతో స్కూటర్ స్వయంగా బయటకు కూడా వెళుతోందని ముచ్చటగా చెబుతోంది లిండా. ఇప్పుడు వరల్డ్ అగ్లీయస్ట్ డాగ్ గా అవార్డు, ప్రైజ్ మనీ గెలవడంతో ప్రపంచమంతా ఈ కుక్క వైరల్ గా మారింది.
కరోనా పాండమిక్ టైంలో రెండు సంవత్సరాల పాటు ఈ కాంపిటీషన్ నిలిపివేసిన నిర్వాహకులు ఇకపై ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం జరుపుతామని తెలిపారు.