Site icon HashtagU Telugu

Guinness Record: కేవలం 15 గంటల్లో 286 మెట్రో స్టేషన్లు చుట్టి గిన్నిస్ రికార్డు సాధించిన యువకుడు?

Guinness Record

Guinness Record

దేశ రాజధాని ఢిల్లీలో ఒక యువకుడు ఒక అరుదైన గిన్నిస్ రికార్డుని నెలకొల్పగా అతనికి గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ మాత్రం దాదాపు రెండేళ్ల తర్వాత వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన శశాంక్‌ మను ఫ్రీలాన్స్‌ రీసెర్చర్‌గా పని చేస్తున్నాడు. అతనికి మెట్రో ట్రైన్ లో ప్రయాణించడం అంటే ఇష్టం. దాంతో ఢిల్లీలో ఉన్న అన్ని మెట్రో స్టేషన్ లను చుట్టేయాలని నిర్ణయించుకున్నాడు. 2021 ఏప్రిల్‌ 14న తన ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని మెట్రో బ్లూ లైన్‌ నుంచి ఉదయం 5 గంటలకు ప్రారంభించాడు.

మెట్రో గ్రీన్‌లైన్‌ సమీపంలోని బ్రిగేడియర్ హోషియార్‌ సింగ్‌ స్టేషన్‌ వద్ద అదే రోజు రాత్రి 8.30 గంటల సమయంలో తన ప్రయాణాన్నిముగించాడు. మొత్తం 15 గంటల 22 నిమిషాల 49 సెకన్ లలో 286 స్టేషన్ లను చుట్టొచ్చాడు. అయితే రెండేళ్ల కిందటే అతడు ఈ ఘనత సాధించినప్పటికీ చిన్న పొరపాటు వల్ల గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ నుంచి ఆలస్యంగా గుర్తింపు వచ్చింది. ఈ అవార్డును తొలుత మెట్రో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ ప్రఫుల్‌ సింగ్‌కు ఇచ్చారు. అతడు 2021 ఆగస్టు 29న 16 గంటల 2 నిమిషాలలో దిల్లీ మెట్రో స్టేషన్ లన్నింటిని చుట్టొచ్చాడు.

దీంతో అతడికి అవార్డు దక్కింది. కానీ 2021 ఏప్రిల్‌ 14న ప్రఫుల్‌ సింగ్‌ కంటే ముందే శశాంక్‌ మను ఈ ఘనత సాధించినట్లు గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ (GWR)కు తెలిసింది. దీంతో ఇటీవల ఏప్రిల్‌లో అతడు ఈ అవార్డును దక్కించుకున్నాడు. గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి శశాంక్‌ మను తాను సందర్శించిన ప్రతి మెట్రో స్టేషన్‌లో ఫొటోలు తీసుకున్నాడు. ప్రతిచోటా తన ఉనికికి సాక్ష్యంగా వ్యక్తుల నుంచి సంతకాలు తీసుకున్నాడు. అదనంగా అతడి ప్రయాణం పూర్తయ్యేంతవరకూ ఇద్దరు వ్యక్తులు సాక్ష్యంగా ఉన్నారు. ఢిల్లీ లోని అన్ని మెట్రో స్టేషన్ లను అత్యంత వేగంగా సందర్శించినందుకు నాకు లభించిన సర్టిఫికేట్‌ చూడండి అని మను ఏప్రిల్‌లో ట్వీట్‌ చేశారు. నోయిడా నుంచి గ్రేటర్‌ నోయిడా, అక్వా లైన్‌, గురుగ్రామ్‌లోని రాపిడ్ మెట్రోను కలుపుకుని 12 లైన్లు, 286 స్టాపులతో ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌ 391 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది.