Site icon HashtagU Telugu

Bride calls off wedding in Karnataka: తాళి కట్టేముందే వరుడికి ఊహించని షాక్… వైరల్ అవుతోన్న వీడియో

Bride Calls Off Wedding In Karnataka

Bride Calls Off Wedding In Karnataka

Bride calls off wedding in Karnataka: ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉండగా, మరికొన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఏం జరిగిందో తెలిసేలోపే ఓ పెళ్లి వీడియో తెగ ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంది. నిజంగా జరిగిందా? కావాలనే స్టంట్ చేసిన పబ్లిసిటీ కోసమా? అనే అనుమానాలు వచ్చేలా కొన్ని వీడియోలు మిగిలిపోతున్నాయి.

పెళ్లిలోకి మాజీ లవర్స్ ఎంట్రీ ఇచ్చిన ఘటనలు, వధువు పెళ్లిలో గొడవ పెట్టుకున్న వీడియోలు నెట్టింట హల్‌చల్ చేసిన సందర్భాలు చూశాం. అలాగే కాబోయే భర్తకు ఇంగ్లీష్ రాదని, లేదా అతను మద్యపానంతో పెళ్లికి రావడం వంటి విషయాల కారణంగా వధువు పెళ్లిని క్యాన్సిల్ చేసిన సంఘటనలు కూడా వార్తల్లో నిలిచాయి. కొన్ని చోట్ల వరకట్నం వివాదాల కారణంగా పెళ్లి ఆగిపోయిన ఘటనలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

మంగళసూత్ర వేళ వధువు కన్నీటిపర్యంతం…

పెళ్లి అంటే ఆనందోత్సవాలకే ప్రతీక. కానీ కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఓ పెళ్లి మాత్రం ఒక్కసారిగా భావోద్వేగాల భూమికగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

చుంచనగిరి కళ్యాణ మండపంలో వివాహ వేడుక జరగుతోంది. బంధువులతో, స్నేహితులతో కళకళలాడుతున్న వేదికపై, పండితుడు మంగళసూత్రం ధారణకు సిద్ధం చేస్తున్నారు. వరుడు మంగళసూత్రం తీసుకుని వధువు మెడలో కట్టబోతున్న సమయంలో, ఒక్కసారిగా వధువు గట్టిగా వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది.

అందరూ ఆశ్చర్యపోయేలోపే, ఆమె తన మనసులో మాట బయటపెట్టింది. “ఈ పెళ్లి నాకు ఇష్టంలేదు. నా ప్రియుడిని మర్చిపోలేకపోతున్నాను. అతను పెళ్లికి రాబోతున్నాడు” అని వధువు ప్రకటించింది. దీంతో వరుడు తీవ్ర మనస్థాపానికి గురై పెళ్లిని రద్దు చేసుకుని అక్కడినుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు.

అంతలో వధువు స్టేజ్‌పై నుంచి దిగిపోయి, అక్కడికి వచ్చిన తన ప్రియుడితో కలిసి కారు ఎక్కి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. కొందరు వధువు ధైర్యాన్ని అభినందిస్తుండగా, మరికొందరు వరుడికి తృటిలో తప్పిందని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. “బ్రో, నువ్వు బతికిపోయావ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.