ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పారిస్‌లోని ఈఫిల్ టవర్ (Eiffel Tower) కూల్చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. “1889లో నిర్మించబడిన ఈ టవర్ ఇప్పుడు బలహీనపడిపోయిందని, దాని నిర్వహణకు భారీగా ఖర్చులు వస్తున్నందున ఫ్రాన్స్ ప్రభుత్వం దాన్ని తొలగించబోతోందని” అంటూ పలు సోషల్ మీడియా ఖాతాలు పోస్టులు చేశాయి. ఈ పోస్టులు లక్షలాది మందికి చేరి, ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కొందరు దీనిని నమ్మి విచారం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఇది ఫేక్ న్యూస్ అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ పుకార్లు మరింత బలపడటానికి కారణం ..ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన సిబ్బంది సమ్మె. టవర్ నిర్వహణ సిబ్బంది వేతనాల పెంపు, పనిదినాల షెడ్యూల్ సవరణ వంటి డిమాండ్లతో సమ్మె ప్రారంభించడంతో ఈఫిల్ టవర్ సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సమ్మె సమయంలో కొందరు సోషల్ మీడియా వినియోగదారులు “టవర్ మూసివేయడమే కాదు, దాన్ని కూల్చే నిర్ణయం తీసుకున్నారు” అంటూ తప్పుడు సమాచారం ప్రచారం చేశారు. ఆ వార్తలు క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి పర్యాటకుల్లో గందరగోళం సృష్టించాయి.
ఇక ఈ పుకార్లపై ఈఫిల్ టవర్ నిర్వహణ సంస్థ “సొసైటీ డ్ ఎక్స్ప్లోయిటేషన్ డే లా టూర్ ఎఫిల్” (SETE) అధికారికంగా స్పందించింది. “టవర్ పూర్తిగా సురక్షితంగా ఉంది. దాన్ని కూల్చివేయాలనే ఆలోచనే లేదు. కేవలం సిబ్బంది సమ్మె కారణంగా సందర్శన తాత్కాలికంగా నిలిపివేయబడింది. సమ్మె ముగిసిన వెంటనే టవర్ మళ్లీ సందర్శకులకు అందుబాటులోకి వస్తుంది” అని సంస్థ స్పష్టం చేసింది. ఫ్రాన్స్ పర్యాటక శాఖ కూడా ఈ వార్తలను అసత్యంగా తేల్చి పెట్టింది. నిపుణుల ప్రకారం, ఈఫిల్ టవర్ ప్రతి సంవత్సరం పునరుద్ధరణ, మరమ్మతులతో సుస్థిరంగా నిర్వహించబడుతోంది, కాబట్టి దాన్ని తొలగించే అవసరం అసలు లేదని చెప్పారు. ఈ సంఘటనతో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను నమ్మేముందు వాస్తవాన్ని ధృవీకరించాల్సిన అవసరం ఎంత ముఖ్యమో మరోసారి వెల్లడైంది.

