మహారాష్ట్ర (Maharashtra)లోని షోలాపూర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన జరిగింది. 50 మంది బ్రహ్మచారులు ‘సెహ్రాలు’ , వివాహ కిరీటాలు ధరించి గుర్రాలపై కలెక్టర్ కార్యాలయం ఎదుటకి వచ్చి ధర్నా చేశారు. బాజా భజంత్రీల టీమ్ ను కూడా తమ వెంట తెచ్చుకున్నారు. మహారాష్ట్ర (Maharashtra) రాష్ట్రంలో స్త్రీ, పురుష నిష్పత్తిని మెరుగుపరిచేందుకు ప్రీ-కాన్సెప్షన్ అండ్ ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (పీసీపీఎన్‌డీటీ) చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించారు. బ్రైడ్ గ్రూమ్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని పక్కగా అమలుచేయక పోయినందు వల్లే రాష్ట్రంలో స్త్రీల జనాభా నిష్పత్తి తగ్గిపోయిందని సంస్థ సభ్యుడు ఆరోపించారు. ఫలితంగా తాము పెళ్లి చేసుకునేందుకు వధువులు దొరకడం లేదని ఆరోపించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21) ప్రకారం.. మహారాష్ట్రలో లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు 920 మంది స్త్రీలు మాత్రమే.