Site icon HashtagU Telugu

Gitaben Rabari : ఉక్రెయిన్ కు సాయం కోసం గుజరాతీ భామ పాట.. అమెరికాలో డాలర్ల వర్షం

Gujarati Singer

Gujarati Singer

ఉక్రెయిన్ కు అండగా నిలవడానికి వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు కూడా తమకు తోచిన విధంగా సాయం అందించడానికి ప్రయత్నిస్తున్నారు. అమెరికాలోని ఎన్ఆర్ఐలు కూడా ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నారు. అందుకే గుజరాతీ ఎన్ఆర్ఐలు గాయని గీతాబెన్ రాబరితో ఓ మ్యూజిక్ షో ను ఏర్పాటుచేశారు. వారి ప్రయత్నం ఫలించింది. జార్జియా, అట్లాంటాలో ఏర్పాటు చేసిన ఆమె లైవ్ షోలకు ప్రేక్షకులు క్యూ కట్టారు. డాలర్ల వర్షం కురిపించారు.

Gujarati Singer1

గీతాబెన్ షో జరిగిన స్టేజ్ మొత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయిందీ అంటే.. ఆ షో ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో పేరు లోక్ దేరో. దీనిని సూరత్ ల్యూవా పటేల్ సమాజ్ ఏర్పాటుచేసింది. మొత్తం 3 లక్షల డాలర్లు ఈ షో కు విరాళంగా అందాయి. అంటే మన కరెన్సీలో చూస్తే.. దాదాపు రూ.2.25 కోట్ల రూపాయిలు. ఏ రకంగా చూసినా.. రెండు షోలకు ఇంత మొత్తం సమకూరడమంటే రికార్డే.

ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి మన భారతీయులు ఎప్పుడూ ముందుంటారు. అందులోనూ గుజరాతీలు ఆర్థికంగా బలంగా ఉండడంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మరింతగా సాయం చేయడానికి వారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే గీతాబెన్ తో ఈ షో నిర్వహించారు. పైగా 26 ఏళ్ల గీతాకు గుజరాత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు.

2020 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా వచ్చినప్పుడు.. నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్ లో ప్రధాని మోదీ, ట్రంప్ ముందు గీతా.. గానకచేరీ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే తాజా పోగ్రామ్ ను కూడా లక్షల మంది చూశారు. వేల మంది లైక్ కొట్టారు. ఈ షో ఫోటోలను గీతా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అవి కాస్తా వైరల్ గా మారాయి.

Exit mobile version