MLA Kotamreddy: జ‌గ‌న్న ప్ర‌భుత్వంలో ఎమ్మెల్యే ఔదార్యం

నెల్లూరు నగరంలో తెల్లవారుజాము భారీ వర్షం పడింది.

  • Written By:
  • Updated On - August 4, 2022 / 04:29 PM IST

నెల్లూరు నగరంలో తెల్లవారుజాము భారీ వర్షం పడింది. ఈ వర్షానికి మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి వద్ద మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోయింది. గురువారం ఉదయం వివాహాలు ఎక్కువగా ఉండటంతో మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. మోకాళ్ళలోతు నీళ్లలో వాహనాలు చిక్కుకుపోయి. ముందుకు కదలలేక ఆగిపోయాయి. అదే సమయంలో మాగుంట లేఔట్ బ్రిడ్జి మీదగా తన కార్యాలయానికి వెళ్ళేందుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ప్రత్యక్షంగా పరిస్థితిని చూసి కారు దిగి నేరుగా మోకాళ్ళ లోతు నీళ్లలోనే నడుచుకుంటూ కారు వద్దకు వెళ్లారు. వర్షపు నీళ్ళల్లో ఆగిపోయిన కారును ఆయనే స్వయంగా తోయడం ప్రారంభించారు.

ఆయ‌న‌తో పాటు గన్ మెన్ రమేష్, షంశుద్దిన్, డ్రైవర్ అంకయ్యతో పాటు చుట్టుపక్కల వారు సహాయం చేశారు. బ్రిడ్జి మధ్యలో నుంచి మాగుంట లేఔట్ ఎత్తు ఎక్కే వరకు కారును తోసారు. జోరు వర్షంలో కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే తన వంతు బాధ్యతగా మోకాళ్ళలోతు నీళ్లలో ఓవైపు వర్షంలో తడుస్తూనే చిక్కుకుపోయిన కారును తోయడం అక్కడున్న వారి ని ఆలోచింప చేసింది. అక్కడి నుంచి కార్పొరేషన్ అధికారులు, ట్రాఫిక్ అధికారులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి స్వయంగా మాట్లాడారు. నీటిని త్వరితగతిన తోడివేయాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. సమాజంలో కొన్ని సంఘటనలు చూస్తూ మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా మోకాల్లోతో నీళ్లల్లో ఆయన చేసిన సహాయం పదిమందికి ఆదర్శంగా నిలిచిపోయింది. ఏపీ వ్యాప్తంగా రోడ్ల ప‌రిస్థితి ఇలాగే ఉంది. వ‌ర్షాలు ప‌డితే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో కోటంరెడ్డి స‌హాయాన్ని అభినిందించాలా? జ‌గ‌న్ స‌ర్కార్ నిర్వాకాన్ని ప్ర‌శ్నించాలా? అనేది అర్థం కావ‌డంలేదు. రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలు వాహ‌నాల‌ను తోస్తూ స‌హాయం చేయ‌డం బెట‌ర్ అని ప్ర‌త్య‌ర్థి పార్టీలు సెటైర్లు వేస్తున్నారు.