Pawan Kalyan : ప్రకాశం జిల్లా నరసింహపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన భారీ సభలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ సగటు మనిషిని బెదిరించడమే వైసీపీ పాలనకు మూలమైందని, అదే కారణంగా వారు ఈ రోజు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని అన్నారు. 2029లో మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏమవుతుందో చూస్తాం అంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. మీరే మొదట అధికారంలోకి రావాలి కదా? మీకు మళ్లీ ప్రజలు అవకాశం ఇస్తారేమో చూడాలి అని ఎదురు ప్రశ్నించారు. ప్రజలను భయపెట్టి పాలించాలన్న ధోరణి ఇక పనిచేయదని పవన్ స్పష్టం చేశారు.
Read Also: Lockup Death : తమిళనాడు లాకప్ డెత్.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు
జన్‌సేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి పాలన అందించాలన్న సంకల్పంతో పనిచేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ వంటి ప్రాజెక్టులను పట్టించుకోలేదు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. మంచినీరు అందించాలన్న దృష్టికూడా వారికి లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రజల ప్రాధాన్యతలపై దృష్టి పెట్టింది. ప్రజా సంక్షేమమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో గూండాయిజం, రౌడీయిజం పెరిగిపోయాయని ఆరోపించారు. వైద్య, విద్యా రంగాల్లో అభివృద్ధి పేరుతో చేసిన పథకాలు కేవలం కమీషన్లకే పరిమితమయ్యాయి. ప్రజల మేలు అనే తపన అప్పుడు లేదని, ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం నేరుగా గ్రామాల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. తాను రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజల కోసం అన్నారు. ఇప్పుడు మేం అధికారంలో ఉన్నామంటే అది ప్రజల నమ్మకానికి నిదర్శనం. వారి ఆశల్ని నెరవేర్చే విధంగా పనిచేస్తాం అని హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. నేను ఎవరిపై వ్యక్తిగత కక్షలు పెట్టుకునే వ్యక్తిని కాదు. కానీ ప్రజలను వేధించే విధానాన్ని మాత్రం సహించను. ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను అని వెల్లడించారు. ఈ సభలో పవన్ కల్యాణ్ హాజరైన ప్రజలతో సాన్నిహిత్యంగా మమేకమై, వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. పథకం ద్వారా గ్రామానికి శుద్ధి చేసిన తాగునీరు అందించనున్నట్లు అధికారులు వివరించారు.