New Scam : కరెంట్ బిల్లు ముసుగులో సైబర్ దొంగల ఆగడాలు.. వేలాది ఫిర్యాదుల వెల్లువ!!

"గత నెలలో కరెంట్ బిల్లు కట్టలేదా? మీ ఇంట్లో కరెంట్ కట్ అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ మీరు బిల్ చెల్లిస్తే ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో మీ బిల్లు రిఫ్లెక్ట్ కాలేదు కావచ్చు.

  • Written By:
  • Publish Date - October 10, 2022 / 01:05 PM IST

“గత నెలలో కరెంట్ బిల్లు కట్టలేదా? మీ ఇంట్లో కరెంట్ కట్ అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ మీరు బిల్ చెల్లిస్తే ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో మీ బిల్లు రిఫ్లెక్ట్ కాలేదు కావచ్చు. వెంటనే బిల్లు కట్టాలంటే లింక్ పై క్లిక్ చేయండి. బిల్ పే చేయండి. ఒకవేళ మీరు బిల్లు కట్టినట్లయితే ఈ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా అది ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో మీ బిల్ రిఫ్లెక్ట్ అవుతుంది” అని పేర్కొంటూ మీకు వచ్చే మెసేజ్ ల విషయంలో అస్సలు స్పందించవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కరెంట్ కట్ అవుతుందని బెదిరించి సైబర్ నేరగాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇక ఆ లింక్ ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్లు మీ ఫోన్లో ఉన్న డేటాను చోరీ చేస్తారని, మీ బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తారని వార్నింగ్ ఇస్తున్నారు.

చాలా నెలల క్రితమే..

నిజానికి చాలా నెలల క్రితమే ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఇఫ్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ స్కాం వెలుగు చూడటం విశేషం. సైబర్ క్రైమ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని జమ్తారా నుంచి ఈ విద్యుత్ బిల్లుల సైబర్ మోసం బయటపడింది.  స్కామర్లు, వివిధ మార్గాల్లో సేకరించిన ఫోన్ నెంబర్లకు కరెంటు బిల్లు బకాయి ఉందని, వెంటనే క్లియర్ చేయాలని మెసేజ్‌ చేస్తారు. ఇందుకోసం మెసేజ్‌లను ప్రజలకు పంపేందుకు బల్క్ సిమ్ కార్డులను కొనుగోలు చేసేందుకు ఈ ముఠా మొదట సిమ్ కార్డ్ విక్రేతలను సంప్రదించినట్లు సమాచారం తెలిసింది.
ఈ స్కామర్లు కస్టమర్ల డబ్బులను కొట్టేయడానికి ఒక బ్యాంకు ఖాతాను సృష్టించారు. తర్వాత, వారు పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులను చెల్లించాలని ప్రజలకు మెసేజ్ పంపారు.

వెయ్యికి పైగా ఫిర్యాదులు..

దేశవ్యాప్తంగా విద్యుత్ బిల్లు సైబర్ స్కాం సంబంధించి వెయ్యికి పైగా ఫిర్యాదులు నమోదైనట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
ఇటీవలి నివేదికల ప్రకారం, ఈ విద్యుత్ బిల్లు స్కామ్‌తో ప్రజలను మోసగించినందుకు ఢిల్లీ పోలీసుల సైబర్ క్రైమ్ యూనిట్ 65 మందిని అరెస్టు చేసింది. జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో ఇలాంటి స్కామ్‌ ఘటనలు ఎక్కువగా జరిగినట్లు చెబుతున్నారు.

1930 కు కాల్ ..

ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు నేరాల పట్ల తస్మాత్ జాగ్రత్త అంటున్నారు. ఇంటర్నెట్ సేఫ్టీ లో రెండడుగులు ముందుందామని, దీని కోసం గూగుల్ సేఫ్టీ సెంటర్ ను లాగాన్ అవ్వాలని సూచిస్తున్నారు.
సైబర్ నేరాలు జరిగితే వెంటనే అలెర్ట్ అయి … హెల్ప్ లైన్ నంబర్
1930 కు కాల్ చేయాలని కోరుతున్నారు. త్వరగా పిర్యాదు చేసినట్లయితే జరిగిన నష్టాన్ని త్వరితగతిన పరిష్కరించే వీలుంటుందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ లో వచ్చే మోసపూరిత సందేశాలు, మోసపూరిత లింకుల విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.