World Nature Conservation Day : ప్రకృతికి జై.. కాలుష్యంపై యుద్ధానికి సై

World Nature Conservation Day  : ప్రకృతి.. భూమిపై ఉన్న సకల జీవ రాశులకు ఆధారం. ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత.

  • Written By:
  • Publish Date - July 28, 2023 / 01:23 PM IST

“అడవులకు మనం ఏం చేస్తున్నామో.. అవి కూడా మనకు అదే చేస్తున్నాయ్” అని జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. వాస్తవానికి మనుషుల చేష్టల వల్ల అడవులు చాలా నష్టపోయాయి. పారిశ్రామికీకరణ, మైనింగ్ కార్యకలాపాల వల్ల అడవులు, నదులు, సముద్రాలపై కోలుకోలేని  దెబ్బ పడింది. ఫలితంగా  ఎన్నో జంతు జాతులు, పక్షి జాతులు, జలచరాల ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది.  గ్లోబల్ వార్మింగ్ అనేది జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసింది. ఇందువల్లే  ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం  ఎండాకాలంలో వాతావరణం మండిపోతోంది.  వానాకాలంలో వరదలు ముంచెత్తుతున్నాయి. సముద్ర మట్టాలు పెరిగి.. తీర ప్రాంతాల పాలిట  గండంగా మారుతున్నాయి. ఈక్రమంలోనే ఇండోనేషియా దేశ రాజధాని నగరాన్ని జకార్తా నుంచి నుసంతరాకు  మార్చారు.

దేశ రాజధానినే మార్చేయాల్సి వచ్చింది 

ఇండోనేషియా ప్రస్తుత రాజధాని జకార్తాలో సుమారు కోటి మంది ప్రజలు నివసిస్తున్నారు. జకార్తా గ్రేటర్ మెట్రో పాలిటన్ ప్రాంతంలో 35 లక్షల మంది ఉన్నారు. అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో జకార్తా నగరం వేగంగా సముద్రంలో మునిగిపోతోందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. జకార్తా సిటీలో ఏటా కొన్ని సెంటిమీటర్ల మేర నేల కుంగుతోంది.  2050 నాటికి జకార్తాలోని మూడింట ఒక వంతు మునిగిపోయే అవకాశం ఉంది. దీంతో ఈ కొత్త రాజధాని నగరం అవసరమైంది. బోర్నియో ద్వీపానికి తూర్పున ఉన్న కాలిమాంటన్ అటవీ ప్రాంతంలో నుసంతర పేరిట కొత్త నగరాన్ని ఇండోనేషియా ప్రభుత్వం నిర్మిస్తోంది.

Also read : WI vs IND: కరేబియన్ గడ్డపై సత్తా చాటిన బౌలర్లు

ఇవి పాటిద్దాం.. ప్రకృతిని కాపాడుకుందాం 

నిత్య జీవితంలో మనం చేసే చిన్నచిన్న తప్పులను సరిదిద్దుకుని..  కొన్ని మంచి పద్ధతులను ఆచ‌రించ‌డం వ‌ల్ల ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

  • రోజువారీ కార్య‌క‌లాపాల్లో వాతావరణ కాలుష్యాన్ని పెంపొందించే పనులను వీలైనంత తగ్గించాలి.
  • ఆహార, నీటి వృథాను అరికట్ట‌డం.
  • నల్లా నీటి వృథా కాకుండా చూడాలి.
  • ప‌నిలో లేన‌ప్పుడు లైట్లు, ఫ్యాన్లు, ఎయిర్ కండిష‌న‌ర్‌ల‌ను ఆపేయాలి.
  • చెట్లను నరికి వేయకూడదు.
  • కొత్త మొక్కలను నాటాలి.
  • కాలుష్యాన్ని పెంచే వాహనాల వినియోగాన్ని తగ్గించాలి.