Amit Shah : ప్రపంచానికి సిందూర్‌ విలువ తెలిసింది: కేంద్రహోంమంత్రి అమిత్‌ షా

ఇది మన జాతీయ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం. మన సైన్యం, మోడీ నాయకత్వం, ప్రజల సంఘీభావం ఇవన్నీ కలసి ఈ విజయం సాధించాయి అని ముగించారు.

Published By: HashtagU Telugu Desk
world has come to know the value of vermilion: Union Home Minister Amit Shah

world has come to know the value of vermilion: Union Home Minister Amit Shah

Amit Shah : ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. మన తల్లులు, సోదరీమణుల నుదుటిపై మెరిసే సిందూర రేఖ ఎంత విలువైనదో ప్రపంచానికి చాటిచెప్పామని ఆయన పేర్కొన్నారు. ఇది మామూలు దాడి కాదని, ఇది దేశ గౌరవాన్ని నిలబెట్టే కార్యాచరణగా అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్‌ ద్వారా భారత సైన్యం మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అందులో రెండు ప్రధాన ఉగ్ర కార్యాలయాలు కూడా ఉన్నాయని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ దాడులు పూర్తిగా ఉగ్రవాద లక్ష్యాలపైనే కేంద్రీకరించబడ్డాయని, పాకిస్తాన్ ప్రజలకో, సైనిక స్థావరాలకో ఎలాంటి హానీ జరగలేదని తెలిపారు.

ఈ దాడుల అనంతరం పాక్‌ సైన్యం నిషేధిత ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరవడాన్ని హోంమంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎలా మద్దతు ఇస్తుందో ప్రపంచానికి చూపించిందే. ఎవరు ఉగ్రవాదుల వెనుక ఉన్నారో స్పష్టమైపోయింది అని అన్నారు. ఈ విజయవంతమైన ఆపరేషన్ వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృఢమైన రాజకీయ సంకల్పం ఉందని అమిత్ షా కొనియాడారు. నిఘా సంస్థలు అందించిన ఖచ్చితమైన సమాచారం, త్రివిధ దళాల సమన్విత ప్రదర్శన వల్లే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందన్నారు.

పాక్ ఉగ్రవాదాన్ని టూరిజంగా తీసుకుంటోందని ప్రధాని మోడీ గతంలో వ్యాఖ్యానించిన విషయాన్ని అమిత్ షా మరోసారి గుర్తు చేశారు. పాకిస్తాన్ ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్ల మీకు ఏమొచ్చింది? భారత్ ఈరోజు ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కానీ మీ పరిస్థితి ఏమిటి? అంటూ ప్రశ్నించారు. దేశ భద్రతకు సంబంధించి మోడీ ప్రభుత్వం ఎలాంటి రాజీకి రాకుండా పనిచేస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. దేశ శాంతిభద్రతలను భంగం కలిగించే ఎవరైనా సరే, వారు ఏ మూలన ఉన్నా వెనక్కి నెట్టాం. ఇప్పుడు వాళ్లు బాధతో మూలుగుతున్నారు అని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌ విజయవంతం ద్వారా భారత్‌ అంతర్జాతీయంగా ఉగ్రవాదంపై గట్టి సందేశం పంపించిందని అమిత్‌ షా అన్నారు. ఇది మన జాతీయ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం. మన సైన్యం, మోడీ నాయకత్వం, ప్రజల సంఘీభావం ఇవన్నీ కలసి ఈ విజయం సాధించాయి అని ముగించారు.

Read Also:Lokesh : భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి ఆరు శాసనాలు : మంత్రి లోకేశ్‌ 

 

 

  Last Updated: 27 May 2025, 03:04 PM IST