Site icon HashtagU Telugu

Ladakh : తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ మొదలు..

Withdrawal of forces in eastern Ladakh begins.

Withdrawal of forces in eastern Ladakh begins.

India-China : భారత్ చైనాల మధ్య వాస్తధీన రేఖ వెంబడి గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే విధంగా ఈమధ్య ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దీంతో తూర్పు లడఖ్‌లో పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. భారత్ – చైనా మధ్య ఒప్పందం తర్వాత, ఇరుదేశాల సైన్యాలు వెనక్కి తగ్గడం ప్రారంభించాయి.  బుధవారం డెమ్‌చోక్‌లో ఇరువైపులా ఒక్కో టెంట్‌ను తొలగించారు. గురువారం కూడా కొన్ని తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేశారు.

డెమ్‌చోక్‌లో, భారతీయ సైనికులు చార్డింగ్ డ్రెయిన్‌కు పశ్చిమం వైపునకు తిరిగి వెళుతున్నారు. అటు చైనా సైనికులు డ్రెయిన్‌కు అవతలి వైపునకు అంటే తూర్పు వైపునకు తిరిగి వెళ్తున్నారు. ఇరువైపులా దాదాపు 10-12 తాత్కాలిక నిర్మాణాలతోపాటుగా 12-12 టెంట్లు వేసి ఉన్నాయి. వాటిని త్వరలోనే తొలగించాల్సి ఉంటుందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అయితే డెప్సాంగ్‌లో చైనా సైన్యానికి టెంట్లు లేవు. వాహనాల మధ్య టార్పాలిన్‌లు వేసి తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేసుకున్నారు. గురువారం చైనా సైనికులు తమ వాహనాలను ఇక్కడి నుంచి తొలగించారు. భారత సైన్యం గురువారం అక్కడి నుంచి సైనికుల సంఖ్యను కూడా తగ్గించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, రాబోయే 4-5 రోజుల్లో డెప్సాంగ్ – డెమ్‌చోక్‌లలో పెట్రోలింగ్ ప్రారంభమవుతుందని రక్షణ శాఖ చెబుతోంది.

వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ పున ప్రారంభంపై ఇరు దేశాల మధ్య ఈమధ్యే ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. 2020 గల్వాన్ ఘర్షణలకు ముందు నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడి కొనసాగుతుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈమధ్యే జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ ఒప్పందాన్ని ఇరుదేశాల నేతలు మోదీ, జిన్ పింగ్ ధ్రువీకరించారు. 2020 జూన్ 15వ తేదీన తూర్పు లడాఖ్ లోని గల్వాన్ లోయల్ భారత్ చైనా మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. కానీ ఆ సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు రెండు దేశాలు కూడా పలు సార్లు దౌత్య కమాండర్ స్థాయి చర్చలను జరిపాయి. ఆ చర్చల ఫలితంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకున్నాయి.

Read Also: NEET 2024 : నేడు సుప్రీంకోర్టులో నీట్ పీజీ 2024పై విచారణ