Fact Check:పెట్రోల్, డీజిల్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే ఆ వాహనాలు పేలుతున్నాయా? వాస్తవం ఏమిటి?

ఈమధ్య సోషల్ మీడియాలో కొన్ని దారుణంగా వైరల్ అవుతున్నాయి. అందులో నిజమెంతో తెలియకుండానే.. వాటిని చాలామంది ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటివాటి జాబితాలో బైకులు, స్కూటర్లు పేలిపోయే ఇష్యూ చేరింది.

  • Written By:
  • Publish Date - April 11, 2022 / 12:22 PM IST

ఈమధ్య సోషల్ మీడియాలో కొన్ని దారుణంగా వైరల్ అవుతున్నాయి. అందులో నిజమెంతో తెలియకుండానే.. వాటిని చాలామంది ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటివాటి జాబితాలో బైకులు, స్కూటర్లు పేలిపోయే ఇష్యూ చేరింది. పెట్రోల్ లేదా డీజిల్ ను ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే అవి పేలిపోతాయని కొంతమంది ప్రచారం చేశారు. దీంతో చాలామంది ద్విచక్రవాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఇందులో నిజమెంత?

చాలామందికి వంద రూపాయిలు ఇచ్చి ఆయిల్ కొట్టమంటారు. మరికొందరు ప్రతీసారీ బంకుకు ఏం వెళతాములే అని ఒకేసారి ఫుల్ ట్యాంక్ కొట్టేయమంటారు. కానీ ఇప్పుడు వారిలో టెన్షన్ మొదలైంది. దీనికి కారణం కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే. ట్యాంకులు ఫుల్ చేయడం వల్ల ఎండాకాలం ఆ వాహనాలు పేలిపోయే ప్రమాదం ఉందని.. ట్యాంకుల్లో కొంతైనా గాలి ఉండాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-ఐవోసీ చెప్పిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

రోజుకు ఒక్కసారైనా ట్యాంకు మూత తెరవాలని.. బైకుల్లో పెట్రోల్ ఫుల్ గా పోయడం వల్లే వారం వ్యవధిలో ఐదు బైకులు పేలిపోయాయని ఐఓసీ పేరుతో ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ సంస్థ ఈ రకమైన ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పింది. ఇవన్నీ అవాస్తవాలని చెప్పింది. పెట్రోల్ ను ఫుల్ ట్యాంక్ కొట్టించడం వల్ల ఏ బైకూ పేలిపోలేదని స్పష్టం చేసింది. అయినా ఎండాకాలం కానీయండి.. వేరే ఏ కాలమైనా కానీయండి.. వాహనాలు ఫుల్ ట్యాంక్ కొట్టించడం వల్ల పేలిపోవని చెప్పింది. దీంతో ద్విచక్రవాహనదారులకు కొంత ఊరట లభించింది.

సోషల్ మీడియాలో వాస్తవాలకు బదులుగా ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయడం వల్ల లేని సమస్యలు వస్తున్నాయి. వాటిని వేరేవారికి ఫార్వర్డ్ చేసేముందు సంబంధిత నిపుణులను సంప్రదిస్తే.. ఇలాంటి అవాస్తవాల ప్రచారానికి అడ్డుకట్ట పడుతుంది.

FAKE NEWS IN SOCIAL MEDIA