Cricket In Olympics – 128 Years : 128 ఏళ్లకు ముందు.. ఒలింపిక్స్ లో క్రికెట్ మ్యాచ్ ల చరిత్ర !!

Cricket In Olympics - 128 Years : ఎట్టకేలకు ఒలింపిక్ గేమ్స్ లో మళ్లీ క్రికెట్ చేరింది. 128 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఇది సంభవించింది.

Published By: HashtagU Telugu Desk
LA28 Olympics

LA28 Olympics

Cricket In Olympics – 128 Years : ఎట్టకేలకు ఒలింపిక్ గేమ్స్ లో మళ్లీ క్రికెట్ చేరింది. 128 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఇది సంభవించింది. అది కూడా క్రికెట్ ను ఎంతో ఇష్టపడే భారతగడ్డ వేదికగా దీనికి సంబంధించిన చారిత్రక నిర్ణయం వెలువడింది. సోమవారం ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో ఈ ప్రతిపాదనకు కమిటీ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 2028 సంవత్సరంలో అమెరికాలోని లాస ఏంజెలెస్ వేదికగా జరిగే ఒలింపిక్ గేమ్స్ లో మనం టీ20 క్రికెట్ మ్యాచ్ లను చూసేందుకు లైన్ క్లియర్ అయింది. ఇంతకీ గత 128 ఏళ్లుగా ఒలింపిక్ గేమ్స్ లో క్రికెట్ పోటీలను ఎందుకు నిర్వహించడం లేదు ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

1896లో తొలి ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించినప్పుడు, క్రికెట్ కూడా అందులో భాగంగా ఉండాల్సి ఉంది. కానీ, అప్పుడు క్రికెట్ ఆడే జట్లు లేవు. దీంతో క్రికెట్‌ను గేమ్స్ లిస్టు నుంచి తప్పించారు. నాలుగు సంవత్సరాల తర్వాత 1900లో ఒలింపిక్ గేమ్స్ లో క్రికెట్ ను చేర్చారు. కానీ  క్రికెట్ తో ఎటువంటి సంబంధం లేని ఫ్రాన్స్‌లో ఒలింపిక్స్ జరిగాయి. ఆ ఒక్కసారి మాత్రమే ఒలింపిక్స్‌లో క్రికెట్ కు చోటు దక్కించుకుంది. ఇక పారిస్‌లోనే జరిగిన రెండో ఒలింపిక్ గేమ్స్ లో చేర్చిన 19 క్రీడల్లో క్రికెట్ ఒకటి. అయితే అందులో నెదర్లాండ్స్, బెల్జియం, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ క్రికెట్ జట్లు పాల్గొన్నాయి.  అకస్మాత్తుగా బెల్జియం, నెదర్లాండ్స్ జట్లు ఈవెంట్ నుంచి తప్పుకున్నాయి. దీంతో, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ టీమ్ లు మాత్రమే పోటీలో మిగిలాయి. ఈ రెండు టీమ్ ల మధ్య ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ నిర్వహించారు. దాన్నే ఫైనల్ మ్యాచ్‌గా ప్రకటించారు.

ఒలింపిక్స్‌లో ఆడుతున్నామని కూడా వాళ్లకు తెలియదట..

అప్పుడు ప్రతీ జట్టులో 12 మంది క్రికెటర్లు ఉండేవారు. టెస్ట్  మ్యాచ్‌ను ఇప్పుడు జరుగుతున్నట్లు 5 రోజులుగా కాకుండా.. కేవలం 2 రోజుల మ్యాచ్‌గా నిర్వహించారు. అప్పట్లో ఒలింపిక్స్‌లో పాల్గొన్న బ్రిటన్ టీమ్ కూడా జాతీయ జట్టు కాదు. స్థానిక క్లబ్‌లకు చెందిన టీమ్ ఆనాడు బ్రిటన్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఫ్రాన్స్ జట్టులో కూడా అప్పట్లో కొంతమంది బ్రిటన్ క్రీడాకారులే ఉండేవారు. ఆ మ్యాచ్ లో ఫ్రాన్స్‌పై బ్రిటన్ విజయం సాధించింది. కానీ విజేతలకు బంగారు పతకాన్ని ఇవ్వలేదు. బ్రిటిష్ జట్టుకు వెండి పతకం లభించగా, ఫ్రెంచ్ జట్టుకు కాంస్య పతకం లభించింది. ఈఫిల్ టవర్ చిత్రాన్ని ఇరుజట్లకు జ్ఞాపికగా అందచేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బ్రిటన్, ఫ్రాన్స్ క్రికెట్ టీమ్ లకు తాము ఒలింపిక్స్‌లో ఆడుతున్నామని తెలియదట. ఫ్రాన్స్‌లో జరుగుతున్న వరల్డ్ ఫెయిర్‌లో భాగంగా క్రికెట్ ఆడుతున్నామని వారు భావించారట.  ఈ మ్యాచ్‌ను 12 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ రికార్డుల్లో అధికారికంగా ధృవీకరించిన తర్వాత మ్యాచ్‌లో గెలుపొందిన బ్రిటన్‌కు పసిడి, ఫ్రాన్స్‌కు రజత పతకాలు అందించారు. ఆ తర్వాత అమెరికాలోని సెయింట్ లూయిస్ వేదికగా జరిగిన ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చాలని అనుకున్నారు. కానీ సరైన సంఖ్యలో జట్లు లేక.. ఆ ఆలోచనను విరమించుకున్నారు. అప్పటి నుంచీ ఇప్పటి వరకు క్రికెట్‌ను మళ్లీ ఒలింపిక్స్‌లో(Cricket In Olympics – 128 Years) చేర్చే ప్రయత్నం జరగలేదు.

Also Read: Israel-Hamas War: రేపు ఇజ్రాయెల్ కు జో-బైడెన్

  Last Updated: 17 Oct 2023, 03:12 PM IST