Site icon HashtagU Telugu

Planet Colours: యురేనస్, నెప్ట్యూన్ రంగుల్లో తేడాకు కారణమేంటో తెలిసిపోయింది!!

Uranus Neptune

Uranus Neptune

సౌర కుటుంబంలో చూడటానికి అచ్చం ఒకేలా ఉంటాయి యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు!! పక్కపక్కనే ఉండే ఈ రెండు గ్రహాలపై సైజు, ద్రవ్యరాశి, వాతావరణం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. కానీ ఒకే ఒక్క తేడా ఉంటుంది. అదే.. రంగు!! నెప్ట్యూన్ గ్రహం ముదురు నీలం రంగులో ఉండగా, యురేనస్ గ్రహం లేత నీలి రంగులో ఉంటుంది.

ఈ ఒక్క తేడా మాత్రం ఎందుకు ఉంది ? అనే ప్రశ్నకు సమాధానం అన్వేషిస్తూ అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ లతో బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. పరిశోధకుల విశ్లేషణ ప్రకారం.. యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలపై ఏరోజల్స్ తో కూడిన మూడు పొరలు వివిధ ఎత్తుల్లో విస్తరించి ఉన్నాయి. నెప్ట్యూన్ తో పోల్చుకుంటే.. యురేనస్ గ్రహంపై మధ్యలో ఉన్న ఏరోజల్స్ పొర మందంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పొరలోని ఏరోజల్స్ లోకి దట్టమైన మీథేన్ ఐస్ అణువులు కూడా కలిసిపోతాయని తెలిపారు.

అయితే నెప్ట్యూన్ గ్రహంపై ఉండే వాతావరణం చాలా పారదర్శకమైంది. అక్కడి వాతావరణం లోని మధ్యపొరలో దట్టంగా ఆవరించి ఉన్న మీథేన్ ఐస్ ఏరోజల్స్ ను విచ్చిన్నం చేసే సహజ వ్యవస్థ ఉంటుంది. ఫలితంగా కీలకమైన మధ్య పొరలోని దళసరితనం తగ్గిపోయి.. నెప్ట్యూన్ చాలా కాంతివంతంగా, ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. యురేనస్ గ్రహంపై పారదర్శకమైన వాతావరణ వ్యవస్థ ఉండదు. వాతావరణం మధ్య పొరలోనే మీథేన్ ఐస్ ఏరోజల్స్ ను విచ్చిన్నం చేసే వ్యవస్థ ఉండదు. ఫలితంగా యురేనస్ గ్రహాన్ని మీథేన్ ఐస్ ఏరోజల్స్ దట్టమైన పొర కమ్మేస్తుంది. ఈ కారణం వల్ల యురేనస్ లేత నీలం రంగులో కనిపిస్తుంది. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు జెమినీ నార్త్ టెలిస్కోప్, నాసా ఇన్ఫ్రా రెడ్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్ యూనిట్లను వాడారు.

Exit mobile version