International Womens Day 2025 : ప్రేమ, బలం, విజ్ఞానంతో ప్రతిదాన్నీ మెరిపించే అద్భుతమైన మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఇప్పటికీ కొనసాగుతున్న లింగ అసమానతలను వెలుగులోకి తీసుకురావడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలి. మహిళా సాధికారతకు మద్దతు ఇచ్చే విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వాలు, సంస్థలకు అండగా నిలుస్తాయి. పక్షపాతం, వివక్ష లేని ప్రపంచం కోసం కృషి చేయాలన్న విషయాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది. లింగ సమానత్వాన్ని సాధించడానికి స్థిరమైన చర్యలు, అవగాహన, విధానాల్లో మార్పులు అవసరం. మహిళలందరికీ సురక్షితమైన, న్యాయమైన, ప్రగతిశీల భవిష్యత్‌ను నిర్మించేలా మహిళా దినోత్సవం ప్రోత్సహిస్తుంది. రాజకీయ, సామాజిక. ఆర్థిక రంగాలలో మహిళల హక్కులను ఇది సమర్థిస్తుంది. కార్యాలయాల్లో సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, నాయకత్వ ప్రాతినిధ్యం వంటి కీలకమైన అంశాలపై చర్చలను ఈ వేడుకలు ప్రోత్సహిస్తాయి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర..
ఐక్యరాజ్యసమితి 1975లో మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా గుర్తించింది. ఆ రోజు ప్రాముఖ్యతను పటిష్టం చేసింది. అక్కడి నుంచి, ఏటా మార్చి 8న అన్ని ప్రపంచ దేశాల్లో మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం. వాస్తవానికి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు అమెరికా, యూరప్‌లో జరిగాయి. మహిళల హక్కుల కోసం వాదించిన కార్మిక ఉద్యమాల నుంచి ప్రేరణ పొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఊపిరి పోసుకుంది. జర్మన్ కార్యకర్త క్లారా జెట్కిన్ ఈ ఆలోచనను ప్రతిపాదించారు. క్రమంగా ఇది అమెరికా, యూరప్ దేశాలకు వ్యాపించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మూలాలు 1911 నాటివి. ప్రభుత్వాలు, వివిధ వర్గాలు చేస్తున్న సమష్టి ప్రయత్నాలకు అడ్డంకులను తొలగించి, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాల వాతావరణాన్ని పెంపొందించడాన్ని ప్రోత్సహిస్తుంది.