Ukraine : వంతెన కూలడంతో.. ఎరక్కపోయి ఇరుక్కుపోయిన ఉక్రెయిన్ సైనికులు!!

"ఎరక్కపోయి.. ఇరుక్కుపోయారు" అన్నట్టుగా తయారైంది ఉక్రెయిన్ లోని సేవేరొ డోనేట్స్ నగరవాసుల పరిస్థితి.

  • Written By:
  • Publish Date - June 15, 2022 / 02:00 PM IST

“ఎరక్కపోయి.. ఇరుక్కుపోయారు” అన్నట్టుగా తయారైంది ఉక్రెయిన్ లోని సేవేరొ డోనేట్స్ నగరవాసుల పరిస్థితి. ఈ నగరంలో ఉన్న వందలాది మంది ఉక్రెయిన్ సైనికులు, దానికి మద్దతు తెలిపే ఉద్యమకారులు పెను సవాల్ ను ఎదుర్కొంటున్నారు. ఆ సవాల్ ఏమిటంటే.. సేవేరొ డోనేట్స్ నగరాన్ని ఉక్రెయిన్ లోని ఇతర నగరాలతో అనుసంధానించే రెండు వంతెనలు కూడా కూలిపోయాయి. కాదు.. కాదు.. కూల్చేశారు!! ఇది రష్యా సైన్యం పనా ? ఉక్రెయిన్ సైన్యం పనా ? అనేది తెలియాల్సి ఉంది. రష్యా సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు గతంలో చాలా చోట్ల వంతెనలను ఉక్రెయిన్ సైన్యం కూల్చేసింది. ఈక్రమంలోనే ఈ వంతెనను కూడా ఆ దేశ ఆర్మీ కూల్చేసిందా ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. తదుపరి పరిణామాల గురించి ఆలోచించకుండా తొందరపాటుతో ఇలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఉక్రెయిన్ సైన్యం ముందు రెండే ఆప్షన్లు..

ఏది ఏమైనప్పటికి చివరి వంతెన కూడా కూలిపోవడంతో సేవేరొ డోనేట్స్ నగరంలో ఉన్న ఉక్రెయిన్ సైన్యం ముందు రెండే ఆప్షన్లు మిగిలాయి. ఒకటి.. ప్రాణాలకు తెగించి రష్యా సైన్యంతో పోరాడటం!! మరొకటి.. చేతులు పైకెత్తి లొంగిపోవడం!! సేవేరొ డోనేట్స్ ప్రాంతంలో రష్యా సైన్యం పెద్ద సంఖ్యలో ఉంది. రష్యా సానుభూతిపరులైన మిలిటెంట్ గ్రూపులు కూడా చాలానే ఉన్నాయి. ఈనేపథ్యంలో పరిమిత సంఖ్యలో అక్కడ చిక్కుకుపోయిన ఉక్రెయిన్ సైనికులు, మద్దతుదారులు పోరుబాట పట్టినా సాధించగలిగేది ఏమీ ఉండదు. తమ అధ్యక్షుడు పుతిన్ స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించిన “లుహన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్” పరిధిలోని సేవేరొ డోనేట్స్ ప్రాంత ప్రజలపై ఈగ కూడా వాలనివ్వమని.. వారిని భద్రంగా చూసుకుంటామని రష్యా సైన్యం ప్రకటనలు విడుదల చేసింది. సేవేరొ డోనేట్స్ నగరాన్ని స్థావరంగా మార్చుకొని సమీపంలోని జంట నగరం ” లిసి ఛాన్స్క్” ను ముట్టడించేందుకు రష్యా స్కెచ్ వేసే అవకాశం ఉంది.