Site icon HashtagU Telugu

Al Qadir Trust scam : ఇమ్రాన్, బుష్రా.. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ?

Al Qadir Trust Scam

Al Qadir Trust Scam

అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసు (Al Qadir Trust scam)కు సంబంధించి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను (imran khan arrest) మంగళవారం మధ్యాహ్నం ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో అరెస్టు చేశారు. ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టు వార్త తెలియగానే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమీర్‌ ఫరూఖ్‌.. ఇస్లామాబాద్‌ పోలీసు చీఫ్‌, అంతర్గత వ్యవహారాల శాఖ కార్యదర్శి, అదనపు అటార్నీ జనరల్‌ను 15 నిమిషాల్లోగా కోర్టు ముందు హాజరుపరిచి మాజీ ప్రధానిని ఎందుకు అరెస్టు (imran khan arrest) చేశారో వివరించాలని ఆదేశించారు. రెండు కేసుల్లో బెయిల్‌ విషయమై మంగళవారం ఇ‍మ్రాన్‌ఖాన్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా పాక్‌ ఆర్మీ నాటకీయ పరిణామాల మధ్య ఇమ్రాన్‌ను అదుపులోకి (imran khan arrest) తీసుకుంది. ఈ క్రమంలో ఇమ్రాన్‌ తరఫు లాయర్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇంతకీ ఇ‍మ్రాన్‌ఖాన్‌ ఎందుకు అరెస్ట్‌ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇమ్రాన్ చైర్ పర్సన్ గా అల్-ఖాదిర్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ ట్రస్ట్‌

పాక్ సర్కారు అభియోగాల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పంజాబ్‌లోని జీలమ్‌లో నాణ్యమైన విద్యను అందించే ప్రాజెక్టును అభివృద్ధి చేస్తానని హామీ చేశారు. దీన్ని నెరవేర్చే క్రమంలో ఆయన అల్-ఖాదిర్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ ట్రస్ట్‌ని స్థాపించారు. దీనికి స్వయంగా ఇమ్రాన్ చైర్ పర్సన్ గా వ్యవహరించగా.. ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ, కీలక అనుచరులు జుల్ఫీఖార్ బుఖారీ, బాబర్ అవాన్ లను ఆఫీస్ బేరర్లుగా నియమితులయ్యారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రాజెక్టులో అప్పటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం, బహ్రియా టౌన్ అనే బడా రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత మాలిక్ రియాజ్ మధ్య అంతర్గతంగా ఒక డీల్ కుదిరింది. అప్పటికే బ్రిటన్ కేంద్రంగా బహ్రియా టౌన్ యజమాని మాలిక్ రియాజ్ చేసిన దాదాపు రూ. 1500 కోట్ల మనీ లాండరింగ్ లావాదేవీలను బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ గుర్తించిందని పాక్ సర్కారు వర్గాలు తెలిపాయి. ఆ రూ. 1500 కోట్ల మనీ లాండరింగ్ అమౌంట్‌ను పాకిస్తాన్‌ ప్రభుత్వ సాయంతో బ్రిటన్ నుంచి తనకు అందేలా చేసే అంశంపై రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత రియాజ్‌, ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ మధ్య ఒప్పందం కుదిరిందని పేర్కొన్నాయి. ఈ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కొని ఉన్న బహ్రియా టౌన్ కంపెనీని ప్రభుత్వ ప్రమేయంతో కాపాడుతామని ఇమ్రాన్ అప్పట్లో రియాజ్ కు హామీ ఇచ్చారని ప్రస్తుత సర్కారు ఆరోపిస్తోంది. తమకు ఈమేరకు భరోసా ఇచ్చినందుకు కృతజ్ఞతగానే.. బహ్రియా టౌన్ కంపెనీ నుంచి రూ. రూ. 144 కోట్ల ప్రయోజనం ఇమ్రాన్ ఖాన్ ఫ్యామిలీకి అందిందనే అభియోగాలపై ప్రస్తుతం ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. పాకిస్తాన్ నేష‌న‌ల్ అకౌంట‌బులిటీ బ్యూరో ఈ కేసును విచారిస్తున్నది.

also read  : Imran Khan Arrest: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

ఆ చీకటి ఒప్పందంలో భాగంగానే ..

ఆ చీకటి ఒప్పందంలో భాగంగానే అల్ ఖాదిర్ వ‌ర్సిటీ ట్ర‌స్టుకు బహ్రియా టౌన్ కంపెనీ భూముల్ని కేటాయించినట్లు తెలుస్తోంది. అల్-ఖాదిర్ యూనివర్సిటీ ట్రస్ట్ కోసం బహ్రియా టౌన్ కంపెనీ రూ. 14 కోట్ల నగదుతో పాటు జీలం జిల్లా సోహవాలోని మౌజా బక్రాలాలో 56.25 ఎకరాల భూమిని ఇచ్చిందని అంటున్నారు. 2021లో బహ్రియా టౌన్ కంపెనీ ఈ భూమిని తొలుత ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నాయకుడు జుల్ఫీ బుఖారీకి కేటాయించగా .. అతడి నుంచి విరాళంగా అల్-ఖాదిర్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ ట్రస్ట్‌కు ల్యాండ్ బదిలీ అయింది. బహ్రియా టౌన్ ఇచ్చిన ఆ భూమి విలువ 2019లో నాటికి రూ.183 కోట్లని చెబుతున్నారు. బహ్రియా టౌన్ కంపెనీ మరో 30 ఎకరాల భూమిని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ క్లోజ్ ఫ్రెండ్ ఫెరా షెహజాదీకి ఇచ్చిందనే టాక్ నడుస్తోంది. ఈ మనీలాండరింగ్ డీల్ వల్ల పాక్ ప్రభుత్వ ఖజానాకు అప్పట్లో రూ. 1968 కోట్ల నష్టం జరిగిందని మంత్రి రాణా స‌నావుల్లా ఆరోపించారు.

అల్-ఖాదిర్ విశ్వవిద్యాలయం నిర్వహణ ఇలా..

2021లో స్థాపితమైన అల్-ఖాదిర్ విశ్వవిద్యాలయం.. 2022 డిసెంబరు లో కేవలం 100 మంది విద్యార్థులను నమోదు చేసుకోగలిగింది. మొదటి సంవత్సరంలో 41 మంది.. తరువాతి సంవత్సరంలో 60 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. ట్రస్ట్ కింద రిజిస్టర్ చేయబడినప్పటికీ, అల్-ఖాదిర్ విశ్వవిద్యాలయం తన విద్యార్థుల నుంచి ఫీజులను కూడా వసూలు చేస్తోందని అంటున్నారు. 2021లో అల్-ఖాదిర్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ ట్రస్ట్‌ కు రూ. 5 కోట్లు విరాళాలుగా వచ్చాయి. 2020 జూలై, 2021 జూన్ మధ్య ఈ ట్రస్ట్ రూ. 2 కోట్లు ఆర్జించింది. అదే సమయంలో సిబ్బంది, కార్మికుల జీతాలు సహా మొత్తం ఖర్చు రూ.24 లక్షలు మాత్రమే. ఈ కేసులో రియ‌ల్ ఎస్టేట్ టైకూన్ మాలిక్ రియాజ్ వాంగ్మూలాన్ని గ‌తంలో తీసుకున్నారు. కాగా, ఈ రెండు కేసుల్లో బెయిల్ ద‌ర‌ఖాస్తు చేసుకున్న మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లారు. అయితే బ‌యోమెట్రిక్స్ వివ‌రాలు స‌మ‌ర్పిస్తున్న‌ స‌మ‌యంలో ఇమ్రాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

also read : Imran Khan: బుల్లెట్‌ ప్రూఫ్‌ హెల్మెట్‌తో కోర్టుకు ఇమ్రాన్‌ ఖాన్.. వీడియో వైరల్..!