ఈ రోజుల్లో యువత టెక్నాలజీతో విపరీతంగా అనుసంధానమై ఉండడం, సోషల్ మీడియాలో నిరంతర ఒత్తిడికి లోనవుతుండడం వంటి విషయాల మధ్య తాము ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని వెతుక్కుంటున్నారు. అందులో భాగంగా ఇటీవల టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో “బాత్రూమ్ క్యాంపింగ్” (Bathroom Camping) అనే కొత్త ధోరణి వైరల్‌గా మారింది. ఇది కేవలం అవసరానికి బాత్రూమ్‌ను ఉపయోగించడమేగాక, అక్కడి నిశ్శబ్దతలో ఒత్తిడిని తగ్గించుకోవడం, ఒంటరితనాన్ని ఆస్వాదించడం వంటి భావోద్వేగ అవసరాలకు ఉపయోగపడుతోంది. బాత్రూమ్ అనే ప్రైవేట్ ప్రదేశంలో తమ మనసు నిర్మలంగా మారుతుందనే భావన యువతలో విస్తరిస్తోంది.
టిక్‌టాక్ క్రియేటర్లు చెప్పినట్లు.. బాత్రూమ్ అనేది తమకు బాహ్య ప్రపంచం కనిపించని ప్రైవేట్ గుడిసె లాంటిదిగా మారింది. కుటుంబ కలహాలు, పని ఒత్తిడి, డిజిటల్ ప్రపంచపు నిరంతర స్పందనల నుంచి స్వల్ప విరామం కోసం బాత్రూమ్ క్యాంపింగ్‌ను ఎన్నుకుంటున్నారు. కొంతమంది బాత్రూమ్‌లో పాటలు వింటారు, కాఫీ తాగుతారు, ఏకాంతంలో కాలం గడుపుతారు. అయితే మానసిక నిపుణులు దీనిని ఒక సంకేతంగా చూస్తున్నారు. ఎక్కువసేపు బాత్రూమ్‌లో ఉండే అలవాటు డిప్రెషన్, ఆత్మవిశ్వాస లోపం లేదా పీటీఎస్‌డీ లాంటి సమస్యలకు సూచన కావచ్చని హెచ్చరిస్తున్నారు.
ఇతరులకు అసౌకర్యం కలగకుండా తమ ప్రైవేట్ సమయాన్ని గడపడానికి కొన్ని సంస్థలు వెల్‌నెస్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇది ఉద్యోగులు మానసికంగా తేలికపడేందుకు ఉపయోగపడుతోంది. బాత్రూమ్ క్యాంపింగ్ అనేది తప్పు కాదు, కానీ ఇది ఈ తరం యువతలో ఒక ప్రధాన మానసిక అవసరాన్ని ప్రతిబింబిస్తుంది. అది అణచివేతల నుంచి తక్షణ విముక్తి కావచ్చు. ఈ ప్రవర్తనను “మైక్రో ఎస్కేప్స్”గా కూడా పరిగణించవచ్చు. అసలైన ప్రశ్న ఏమిటంటే.. మీరు శాంతిగా ఉండాలనుకుంటున్నారా? లేక ఒత్తిడిని తట్టుకోలేక దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానమే నిజమైన విశ్రాంతికి దారి చూపుతుంది.