ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద (Swami Vivekananda) జయంతి ఇవాళే. అందుకే ఈ రోజును యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. ఉక్కు సంకల్పంతో ముందుకు సాగితే జీవితంలో ఏదైనా సాధించవచ్చని స్వామి వివేకానంద (Swami Vivekananda) ప్రవచించారు. ఆయన జీవితంలోని ఒక కీలక ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వివేకానంద చాలా చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించారు. సన్యాసి అయ్యే ప్రక్రియలో ఉన్నప్పుడు.. ఒక వేశ్య ఆయనకు సన్యాసి యొక్క నిజమైన నిర్వచనాన్ని వివరించింది. పూర్తి కథ ఏమిటంటే.. వివేకానంద జీవితంలోని ఈ ఘట్టం గురించిన వర్ణన ఓషో కథల్లో చక్కగా కనిపిస్తుంది. వివేకానందకు వీరాభిమాని అయిన జైపూర్ రాజు ఒకసారి ఆయనకు ఆహ్వానం పంపారు. రాజ సంప్రదాయం ప్రకారం.. రాజు వివేకానందను స్వాగతించడానికి చాలా మంది నృత్యకారులను పిలిచాడు. వారిలో ఒక వేశ్య కూడా ఉంది.
సన్యాసికి ఆతిథ్యం ఇస్తున్నప్పుడు వేశ్యను ఉంచకూడదని రాజు తన తప్పును గ్రహించాడు. ఇటువంటి వాటిని సన్యాసులు అపవిత్రంగా పరిగణిస్తారు. అయితే, రాజు ఈ విషయాన్ని గ్రహించే సమయానికే చాలా ఆలస్యం జరిగిపోయింది. రాజు అప్పటికే వేశ్యను రాజభవనానికి పిలిపించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా వివేకానందకు కూడా తెలియడంతో కలత చెందారు. అప్పటికి ఆయన ఇంకా పూర్తి సన్యాసి కాలేదు. కాబట్టి స్త్రీల పట్ల ఆకర్షణను నివారించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
ఒకవేళ వివేకానంద అప్పటికే పూర్తి సన్యాసిగా మారి ఉంటే..ఆతిథ్యం ఇవ్వడానికి ఒక వేశ్యను పిలిచినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. కాబట్టి వేశ్య నీడ తనపై పడకుండా వివేకానంద తనను తాను ఒక గదిలో బంధించుకున్నారు. బయటకు రావడానికి నిరాకరించారు. దీంతో మహారాజు వచ్చి వివేకానందునికి క్షమాపణలు చెప్పారు.
తాను ఇంతకు ముందెన్నడూ సన్యాసికి ఆతిథ్యం ఇవ్వలేదని.. అందుకే ఏం చేయాలో తెలియలేదని చెప్పాడు. వివేకానందను గదిలో నుంచి బయటకు రమ్మని చెప్పాడు. ఆమె దేశంలోనే చాలా ప్రముఖ వేశ్య అని.. అందుకే హఠాత్తుగా వెనక్కి పంపితే ఆమెను అవమానించినట్లు అవుతుందన్నారు. అయినా వివేకానందుడు తలుపు తీయలేదు. వేశ్యల ముందుకు రాలేనని స్పష్టం చేశారు. అక్కడే ఉండి ఆ మాటలు విన్న వేశ్య నిరాశ చెందింది. ఆమె వివేకానంద కోసం పాటలు పాడటం ప్రారంభించింది.
‘నాకు తెలుసు, నేను వేశ్యనని, పాపినని, అధమురాలినని, అజ్ఞానిని.కానీ మీరు పుణ్యాత్ములు.. అలాంటప్పుడు నాకెందుకు భయం?’ అని ఆ పాట ద్వారా చెప్పింది. ఇదంతా విన్న వివేకానంద నిర్ణయం మార్చుకున్నారు. వేశ్య పట్ల ఆకర్షణ భయం తన మనస్సులోనే ఉందని గ్రహించారు. ఈ భయాన్ని వదిలేస్తే, తన మనస్సు ప్రశాంతంగా ఉంటుందని డిసైడ్ అయ్యారు.
వెంటనే తలుపు తీసి వేశ్యకు వివేకానంద నమస్కరించారు. ఈరోజు దేవుడు ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు. నాలో ఏదో కామం ఉంటుందేమోనని భయపడ్డాను.. కానీ నువ్వు నన్ను పూర్తిగా ఓడించావు. ఇంత స్వచ్ఛమైన ఆత్మను నేనెప్పుడూ చూడలేదు” అని వేశ్యతో వివేకానంద చెప్పారు. ‘నేను ఇప్పుడు మీతో ఒంటరిగా ఉన్నా, నా మనసులో భయం లేదు’ అని తేల్చి చెప్పారు.