Congress : కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఈ మేరకు వీలైనంత త్వరలోనే ఇది ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు. భారత రాజ్యాంగంలోని సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని మేం ప్రతిఘటిస్తూనే ఉంటాం అని ఆయన రాసుకొచ్చారు. ఇండియా కూటమి అతిత్వరలో వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీం కోర్టు లో సవాల్ చేయనుంది అన్నారు. ఈసందర్భంగా సీఏఏ, ఆర్టీఐ, ఎన్నికల నియమాలపై గతంలో అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన విషయాన్ని రమేశ్ గుర్తుచేశారు. ప్రస్తుతం అవి విచారణలో ఉన్నాయని జైరాం రమేశ్ తెలిపారు.
Read Also: Veena Vijayan : కేరళ సీఎం కుమార్తెను విచారించేందుకు కేంద్రం అనుమతి
కాగా, రాజ్యసభలో గురువారం మధ్యాహ్నాం నుంచి సుమారు 13 గంటలపాటు వక్ఫ్ బిల్లుపై చర్చ జరిగింది. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. దీంతో శుక్రవారం ఉదయం బిల్లును ఆమోదించినట్లు పార్లమెంట్ అధికారికంగా ప్రకటించింది. ఇక, బుధవారం లోక్‌సభలో వక్ఫ్ (సవరణ) బిల్లుపై 14 గంటలకు పైగా చర్చ జరిగింది. విపక్షాల ఆరోపణలు, అధికారపక్షం కౌంటర్లతో సభ వాడీవేడిగా సాగింది. అనంతరం ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఇక, రాష్ట్రపతి సంతకం కోసం ఈ బిల్లులను ప్రభుత్వం పంపించనుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారనుంది. వక్ఫ్ బిల్లు పేరును.. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ బిల్లుగా (ఉమీద్-యుఎంఈఈడీ)గా ప్రభుత్వం పేర్కొంది.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా.. ఇది మైనారిటీలకు వ్యతిరేకంగా.. రాజ్యాంగవిరుద్ధంగా ఉందంటూ పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఇది చారిత్రక సంస్కరణగా అభివర్ణించిన కేంద్రం ఈ బిల్లు ముస్లింలకు లబ్ధి చేకూరుస్తుందని అంటోంది. అంతకు ముందు.. సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. చర్చ సమయంలో అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ ప్రతిధ్వనించింది.
Read Also: New Hyundai Nexo: హ్యుందాయ్ నుంచి హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కారు.. మైలేజీ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!