Crime: నా భర్తను 35 సార్లు ఇనుప రాడ్ తో కొట్టారు.. జనాలు వీడియోలు తీశారే తప్ప అడ్డుకోలేదు: సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా

మతాంతర వివాహం చేసుకున్న బిల్లాపురం నాగరాజును.. ఆమె భార్య సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా కుటుంబ సభ్యులు హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.

  • Written By:
  • Publish Date - May 7, 2022 / 10:13 AM IST

మతాంతర వివాహం చేసుకున్న బిల్లాపురం నాగరాజును.. ఆమె భార్య సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా కుటుంబ సభ్యులు హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడిరోడ్డుపై జనం చూస్తుండగా ఈ పాశవిక ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో ఉన్న భర్త నాగరాజు ఇంట్లోనే ఉంటోంది. నాగరాజు పుట్టి పెరిగిన ఇంట్లోనే.. అతడిని తలుచుకుంటూ జీవితం సాగిస్తానని సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా తెలిపింది. చుట్టూ పదుల సంఖ్యలో జనం నిలబడి ఉన్నా.. తన భర్త నాగరాజు పై దాడిని అడ్డుకోలేపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. “మా కుటుంబ సభ్యులు, సోదరుడు కలిసి నా భర్త
నాగరాజుపై ఇనుప రాడ్లతో క్రూరమైన దాడి చేశారు. కేవలం 10, 15 నిమిషాల్లోనే .. తలపై 30, 35 సార్లు రాడ్లతో కొట్టారు. ఇదంతా జనాలు ఫోన్ లో వీడియో తీశారే కానీ, ఎవరూ అడ్డుకోలేదు. కనీసం 20 మంది ఎదిరించినా ఆ నలుగురు మూకలు పారిపోయి ఉండేవాళ్లు. నా భర్త నాగరాజు ప్రాణాలు నిలిచి ఉండేవి. మా ఆయన మెదడు చిట్లిపోయేంత ఘోరంగా తలపై కొట్టారు” అని సయ్యద్ ఆశ్రిన్ ఉద్వేగంతో చెప్పుకొచ్చారు. 25 ఏళ్ల నాగరాజు కార్ సేల్స్ మ్యాన్ గా పని చేసేవాడు. నాగరాజు, సయ్యద్ ఆశ్రిన్ లు స్కూల్ డేస్ నుంచే ప్రేమించుకున్నారు. వీరిద్దరు జనవరి 31న ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.

వివాహేతర సంబంధం.. సుపారీ గ్యాంగ్‌ కుట్ర

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని హత్య చేసేందుకు రూ.ఐదు లక్షల డీల్‌ కుదుర్చుకున్న సుపారీ గ్యాంగ్‌ కుట్రను పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి ప్రణాళిక చేసిన ముగ్గురితోపాటు హత్య చేయడానికి ఒప్పుకున్న బిహారీని అరెస్టు చేసినట్టు చెప్పా రు. వేములవాడలోని తిప్పపూర్‌కు చెందిన నీలం శ్రీనివాస్‌ కుమార్తెకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆమె భర్తకు తెలియకుండా వేములవాడకు చెందిన మనోజ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
పద్ధతి మార్చుకోవాలంటూ మనోజ్‌కు పెద్దల సమక్షం లో పలుమార్లు పంచాయితీలు పెట్టారు. కానీ ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. శ్రీనివాస్‌ తన పరిచయస్తులకు ఈ విషయాన్ని చెప్పాడు. మనోజ్‌ హత్యకు శ్రీనివాస్‌.. తిప్పపూర్‌లో ఉండే మానుకు కుంటయ్య, జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బొమ్మాడి రాజ్‌కుమార్, బిహార్‌కు చెందిన లిఖింద్ర సాహ్నితో రూ.5 లక్షలు సుపారీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. మనోజ్‌ రోజు కూలి కోసం వేములవాడ బైపాస్‌ నుంచి వస్తాడని గ్రహించిన వీరు గురువారం ఉదయం బైపాస్‌లోని బతుకమ్మతెప్పవద్ద మరణాయుధాలతో కారులో మాటువేశారు.ఇదే సమయంలో పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి అక్కడున్న కారును తనిఖీ చేశారు. అందులో 2 కొడవళ్లు ఉన్నాయి.

దీంతో వారందరినీ అదుపులోకి తీసుకుని విచారించగా, మనోజ్‌ను హత్య చేయడానికి చేసిన కుట్రను శ్రీనివాస్, కుంటయ్య, రాజ్‌కుమార్, సాహ్ని వెల్లడించారు. పోలీసులు వీరి నుంచి కారు, బైక్, 4 సెల్‌ఫోన్లు, చంపాలనుకున్న వ్యక్తి ఫొటో, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.