Viral Video: మట్టి తీయడం, కట్టెలు కొట్టడం.. స్కూల్‌లో చిన్నారుల చేత ఇలాంటి పనులా?..

సాధారణంగా పిల్లలు.. స్కూల్‌కు వెళ్లి చదువుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం స్కూల్‌కు వెళ్లిన చిన్నారులు పాఠశాల

  • Written By:
  • Publish Date - August 3, 2022 / 03:00 PM IST

సాధారణంగా పిల్లలు.. స్కూల్‌కు వెళ్లి చదువుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం స్కూల్‌కు వెళ్లిన చిన్నారులు పాఠశాల ఆవరణలో చిన్నాచితకా పనులు చేస్తున్నారు. బిహార్‌లో ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో బీహార్‌లోని జెహనాబాద్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పిల్లల చేత గుంత తవ్వడం, ఇటుకలు తీయడం, కట్టెలు నరకడం.. వంటి కూలీ పనులు చేయించడం చూడొచ్చు.

బాలకార్మిక నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. చదువు చెప్పాల్సిన చోటే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై పులువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంతో.. జెహనాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ రిచీ పాండే స్పందించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని.. సంబంధిత పాఠశాల అధికారులపై క్రమశిక్షణా చర్యకు ఆదేశించినట్టుగా చెప్పారు.

 

‘‘మేము వీడియోను గమనించాం. శుక్రవారం జిల్లాలోని కాకో బ్లాక్ పరిధిలోని ఇస్లాంపూర్ పంచాయతీలో ఉన్న పాఠశాలను సందర్శించాం’’ అని రిచీ పాండే చెప్పారు. పాఠశాలలో నిర్వహణ అధ్వాన్నంగా ఉందని.. విద్యార్థుల హాజరు కూడా చాలా తక్కువగా ఉందని ఆయన తెలిపారు. స్కూల్‌లో బ్లాక్ బోర్డులు విరిగిపోయాయని.. మధ్యాహ్న భోజనం కూడా సరైన స్థాయిలో లేదని చెప్పారు. అధికారులపై ప్రాథమికంగా క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశామని చెప్పారు.