pharma company : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిరసన తెగ తగిలింది. ఫార్మా విలేజ్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫార్మా విలేజ్ కోసం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక తహశీల్దార్ కార్లపై రైతులు రాళ్లు విసిరి దాడికి దిగారు. అయితే రైతుల దాడిలో కలెక్టర్, తహశీల్దార్ కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఫార్మా విలేజ్ కోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులతో మాట్లాడేందుకు వచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు లగచర్లకు 2 కిమీ దూరంలో అధికారులు గ్రామ సభ ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఈ గ్రామ సభలో పాల్గొనేందుకు వస్తున్నారని తెలుసుకున్న స్థానిక రైతులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే గ్రామసభను గ్రామంలో కాకుండా ఊరికి దూరంగా ఎందుకు ఏర్పాటు చేశారని రైతులు ప్రశ్నించారు. అంతేకాకుండా ఊరికి అవతల జరుగుతున్నగ్రామసభకు వెళ్లేది లేదని రైతులు తెగేసి చెప్పారు. మరోవైపు గ్రామసభకు వెళ్లిన ఇద్దరు రైతులు కూడా భూసేకరణకు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక చేసేదేమి లేక కలెక్టర్ ప్రతీక్ జైన్ తనే స్వయంగా లగచర్ల గ్రామానికి వచ్చారు. కలెక్టర్ గ్రామానికి రాగానే “కలెక్టర్ గో బ్యాక్” అంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే కలెక్టర్, తహశీల్దార్ కార్లపై రాళ్లు విసిరారు. రైతుల నిరసనల మధ్యే కలెక్టర్ ప్రతీక్ జైన్ కారు దిగి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో రైతులు ఆయనపై దాడికి పాల్పడినట్లు సమాచారం. కాగా, జిల్లా కలెక్టర్, అధికారులు లగచర్ల వెళ్లే సమయంలో ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.