Variety Wedding Card : 900 కుటుంబాల పేర్లతో వివాహన శుభలేఖ.. తమిళనాడులో ఓ వధువు తండ్రి వెరైటీ పెళ్లి పిలుపు

పెళ్లంటే నూరేళ్ల పంట. ఇద్దరు వ్యక్తులు ఆలుమగలుగా మారాలంటే దానికి చాలా తతంగం ఉంటుంది.

  • Written By:
  • Publish Date - June 26, 2022 / 06:00 AM IST

పెళ్లంటే నూరేళ్ల పంట. ఇద్దరు వ్యక్తులు ఆలుమగలుగా మారాలంటే దానికి చాలా తతంగం ఉంటుంది. సంప్రదాయబద్దంగా జరిగే పెళ్లిళ్లు నయనానందకరంగా ఉంటాయి. అందుకే పెళ్లి శుభలేఖ నుంచి అప్పగింతల వరకు అన్నీ గ్రాండ్ గా ఉండాలనుకుంటారు. జీవితంలో ఒక్కసారి చేసుకునే వేడుక కావడంతో ఆ మాత్రం ఉంటుంది మరి. అందుకే తమిళనాడులోని ఆ కుటుంబం ఇప్పటివరకు ఎవరూ చేయని రీతిలో తమ ఆడబిడ్డ పెళ్లి చేసింది. పెళ్లి శుభలేఖ గురించి పదికాలాలపాటు అందరూ చెప్పుకునేలా డిజైన్ చేయించింది. ఇప్పుడా వెడ్డింగ్ కార్డే టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది.

పెళ్లి శుభలేఖ అంటే ఏముంటుంది. వధూవరుల పేర్లు, ఫోటోలు, ఇరు కుటుంబాల వారి పేర్లు, ఇంకా తమకు బాగా సన్నిహితులైనవారి పేర్లతోపాటు బంధుమిత్రులు అని రాస్తారు. ఇక వివాహ ముహూర్తం, విందు, వేదిక సమయంతోపాటు ఇతర వివరాలు ఉంటాయి. సాధారణంగా పెళ్లి శుభలేఖ అంటే ఇలాగే ఉంటుంది. కాస్త ధనవంతులు అయితే ఆ వెడ్డింగ్ కార్డ్ తో పాటు ఖరీదైన బహుమతి కూడా ఇస్తారు. లేదంటే టెక్నాలజీని ఉపయోగించి ఆ కార్డును వెరైటీగా తయారుచేయిస్తారు. అంతే. కానీ తమిళనాడులోని తంజావూర్ జిల్లా కుంభకోణం దగ్గరలో ఉన్న మల్లాపురం పంచాయతీ యూనియన్ అధ్యక్షుడు రమేష్… తన కుమార్తె పెళ్లి శుభలేఖను తయారుచేయించిన తీరును చూస్తే.. వారెవా అనాల్సిందే. ఆయన తన కుమార్తె షాలినిని, కైలాష్ అనే యువకుడినిచ్చి కుంభకోణంలో ఘనంగా వివాహం చేశారు. దానికోసం ఓ నెల ముందే పెళ్లి శుభలేఖలను అచ్చు వేయించి అందరికీ పంచారు.

రమేష్ మల్లాపురం పంచాయతీ యూనియన్ అధ్యక్షుడిగా, రెండోసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆయన పంచాయతీ పరిధిలో ఐదు గ్రామాలు ఉన్నాయి. వాటిలో మల్లాపురం, తిరుమలైరాజాపురం, కచ్చుకట్టు, విల్ వెలంగుడి గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ ఐదు ఊళ్లలో మొత్తం 900 కుటుంబాలు నివాసముంటున్నాయి. వాళ్లందరి మద్దతు వల్లే తాను ఇలా ఉన్నానంటూ.. ఆయన ఏకంగా తన కుమార్తె పెళ్లి శుభలేఖలో ఆ 900 కుటుంబాలలోని దంపతుల పేర్లను ప్రింట్ చేయించారు. దీంతో ఆ కుటుంబాలన్నీ రమేష్ ను అభినందనలతో ముంచెత్తాయి. వాళ్లంతా తన కుటుంబమే అని చెప్పడానికే రమేశ్ అలా చేసినా.. ఆయన చేసిన పనికి మాత్రం ఆ 900 కుటుంబాలు, ఐదు ఊళ్లే కాదు.. దేశమంతా సంతోషపడుతోంది. అందరినీ సమానంగా చూసే ఆయన నుంచి చాలా నేర్చుకోవాలని చెబుతోంది.