Bumper Offer: ఫ్రీగా తెచ్చుకున్న సోఫాలో రూ.27 లక్షలు.. ఆ తర్వాత ఏమైందంటే !!

ఇటీవల కొత్త అద్దె ఇంట్లోకి దిగిన ఆ మహిళ సాధ్యమైనంత తక్కువ బడ్జెట్ లో ఒక సోఫాను కొనాలని భావించింది.

  • Written By:
  • Publish Date - June 5, 2022 / 08:11 PM IST

ఇటీవల కొత్త అద్దె ఇంట్లోకి దిగిన ఆ మహిళ సాధ్యమైనంత తక్కువ బడ్జెట్ లో ఒక సోఫాను కొనాలని భావించింది. ఒక క్లాసిఫైడ్స్ వెబ్ సైట్ లో సెకండ్ హ్యాండ్ సోఫాల కోసం వెతకసాగింది. ఈక్రమంలో ఒక చోట సోఫాను ఫ్రీ గా ఇస్తున్నారని చదివింది. వెంటనే అక్కడికి వెళ్లి ఉచితంగా సోఫాను తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. అసలు కథ అప్పుడే మొదలైంది. సోఫాపై ఉండే దిండ్లకు చిన్నపాటి కుట్లు వేసుకోవడంలో ఆమె నిమగ్నమైంది. ఒక దిండును విప్పగానే కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కేస్తే మొత్తం రూ.27 లక్షలు ఉన్నట్లు తేలింది. దీంతో ఆమె సంభ్రమాశ్చర్యాలకు గురైంది. వెంటనే కేకలు వేసి తన కొడుకును పిలిచి.. ఆ నోట్ల కట్టలను చూపించింది. ఈ వింత అనుభవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ సమీపంలోని కొల్టన్ పట్టణానికి చెందిన మహిళ విక్కి ఉమోదు (Vicky Umodu) కు ఎదురైంది. అయితే ఆమె నిజాయితీని చాటుకుంది. ఆ సోఫాను తనకు ఉచితంగా ఇచ్చిన వాళ్లకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. సోఫాలోని దిండ్ల నుంచి బయటపడిన డబ్బులన్నీ వాళ్లకు ఇచ్చేసింది.ఆ సోఫాల్లో ఉన్న డబ్బు ఎక్కడిదో తమకు కూడా తెలియదని .. దాన్ని ఇచ్చినవాళ్ళు కూడా చెప్పడం గమనార్హం. నిజాయితీని చాటుకున్న విక్కి ఉమోదు ను వాళ్ళు మెచ్చుకున్నారు. 2000 డాలర్లు నజరానాగా ఆమెకు ఇచ్చారు. ఆ డబ్బుతో కొత్త ఫ్రిజ్ కొనుక్కుంటానని విక్కి ఉమోదు చెప్పింది. సోఫా లో దొరికిన డబ్బును నేరుగా తన బీరువాలో పెట్టుకోకుండా.. ఎవరిది వారికి అప్పగించిన విక్కి పై నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.