Site icon HashtagU Telugu

Historic: వైద్యచరిత్రలో అద్భుతం.. మనిషికి ‘పందిగుండె’ మార్పిడి!

Pig Heart

Pig Heart

వైద్యరంగంలోనూ అద్భుత ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయి. వైద్యచరిత్రలోనే మొదటిసారి మనిషికి పంది గుండె అమర్చిన సంఘటన ఒకటి ప్రతిఒక్కరినీ ఆలోజింపచేస్తోంది. అమెరికా వైద్యులు ఈ అద్భుతం చేశారు. 57 ఏళ్ల మేరీల్యాండ్ నివాసి డేవిడ్ బెన్నెట్ ప్రాణాంతక అరిథ్మియాతో బాధపడుతున్నాడు. దీంతో గుండె మార్పిడి చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో డాక్టర్లు పందిగుండెను అమర్చారు.

యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు  ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు. రోగి చక్కగా కోలుకుంటున్నట్టు వైద్యులు ప్రకటించారు. చికిత్సకు ముందు అతడ్ని హార్ట్-లంగ్ బైపాస్ మెషిన్ పై ఉంచారు. ఇప్పటికీ ఆ మెషిన్ ను తొలగించలేదు. రికవరీ బాగుండడంతో నేడు ఆ మెషిన్ ను తొలగిస్తారు. ఈ చికిత్సకు జన్యుపరంగా మార్పిడి చేసిన పంది నుంచి గుండెను తీసుకున్నారు. ఇది సాధారణ పనితీరు చూపిస్తూ పల్స్ ను జనరేట్ చేస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. ఇప్పటి వరకు రోగి శరీరం గుండెను తిరస్కరిస్తున్న సంకేతాలు ఏవీ కనిపించలేదని చెప్పారు. అయితే ఎన్నో జంతువులు ఉన్నప్పటికీ పంది గుండెనే ఎందుకు తీసుకున్నారని చాలామంది పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పందిలోని అవయవాలు మనిషి అవయవాలకు దగ్గర ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.