Israel-Iran War : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా ప్రాంతం మళ్లీ మంటలు ఎగిసిపడుతోంది. రెండు దేశాలు పరస్పరం దాడులు కొనసాగిస్తుండగా, అంతర్జాతీయ సమాజం కాల్పుల విరమణకు పిలుపునిస్తూ చర్చలకు సిద్ధమవ్వాలని కోరుతోంది. కానీ, ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ ఈ పిలుపులను పట్టించుకోవడం లేదు. శాంతి చర్చల ప్రతిపాదనలను కూడా స్పష్టంగా తిరస్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రధాన శత్రువు. ఆయన బలమైన నాయకుడు. దుర్బలంగా ఒప్పందాలు చేసుకునే వాడికాదు. ప్రత్యర్థికి లొంగిపోడు. గతంలో ఇరాన్‌తో జరిగిన అణుఒప్పందాన్ని పక్కనపెట్టి, ఖాసిమ్ సులేమానీని హతమార్చిన వారే ట్రంప్ అని వ్యాఖ్యానించారు.
Read Also: CM Chandrababu : విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు సీఎం చంద్రబాబు
ఇరాన్ ట్రంప్‌ను తుపాకీ గురిపెట్టినట్లు నెతన్యాహు వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడినే చంపాలని టెహ్రాన్ కోరుకుంటోంది. ఎందుకంటే ఆయనే వారి అణ్వాయుధ ప్రణాళికకు అడ్డుగాపడతారు. ట్రంప్ పునః ఎన్నికైతే, ఇరాన్ అణ్వాయుధం కలిగి ఉండే అవకాశం లేకుండా పోతుంది అన్నారు. ఇరాన్ ఈ ప్రపంచానికి పెను ముప్పుగా మారుతోంది. అందుకే మేము ఈ యుద్ధాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ముప్పును పూర్తిగా తొలగించే వరకు మా పోరాటం ఆగదు. ఈ దాడులతో మేము కేవలం ఇజ్రాయెల్‌ను మాత్రమే కాదు, ప్రపంచాన్నే రక్షిస్తున్నాం అని చెప్పారు. ఇదిలాఉండగా, ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’తో ఇరాన్ భారీ నష్టాలను చవిచూస్తోంది. ఇప్పటికే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్ హత్యకు గురయ్యారు.
తాజాగా ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ కజేమీ, ఆయన సహచరుడు జనరల్ హసన్ మహాకిక్ కూడా మృతి చెందారు. మరో కీలక అధికారి కూడా ఇజ్రాయెల్ దాడుల్లో హతమయ్యాడని నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధానంగా ఇరాన్ అణు కేంద్రాలపై వైమానిక దాడులకు దిగుతోంది. సోమవారం తెల్లవారుజామున ఫోర్దో అణు కేంద్రం సమీపంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ పేలుళ్లతో భూమి కంపించినట్లు నివేదికలు చెబుతున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.5గా నమోదైంది. ఈ దాడుల ఫలితంగా ఇప్పటివరకు 14 మంది ఇరానియన్ అణు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంతో ప్రాంతంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ప్రపంచ శాంతికి ఇది పెనుముప్పుగా మారుతుందా అన్న చర్చ నడుస్తోంది.
Read Also: KTR : కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్