Site icon HashtagU Telugu

Love Suicide: ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక.. ప్రియురాలు కూడా…! కర్ణాటకలో విషాద ప్రేమగాథ

karnataka lovers suicide

karnataka lovers suicide

కర్ణాటక రాష్ట్రంలో ఉంటున్న ధనుష్, సుష్మా. వీరిద్దరూ రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. తమ స్వచ్ఛమైన ప్రేమ సంగతి చెప్పి.. ఇరు కుటుంబాలను పెళ్లికి ఒప్పించారు. ఇక తమ భవిష్యత్తు బంగారంలా ఉంటుందని ఎన్నో కలలు కన్నారు. కానీ వారొకటి తలిస్తే.. దైవం మరోలా తలిచింది. పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండగానే.. వారి లవ్ స్టోరీలో ఓ విషాదం తప్పలేదు. ఆ ప్రియుడికి యాక్సిడెంట్ అయ్యింది. అది ఏకంగా ఆ యువకుడి ప్రాణాలనే బలిగొంది.

లైఫ్ లో తన కాళ్లపై తానే నిలబడాలన్న తపనతో ధనుష్ బెంగళూరులో ఓ బట్టల షాపు ఓపెన్ చేశాడు. తరువాత సుష్మాతో పరిచయం అయ్యింది. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చాయి. ఇద్దరు మనసులు కలిశాయి. అది కాస్తా వారి లవ్ ను అమాంతం పెంచేసింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. దీంతో తమ ప్రేమ సంగతి పెద్దలకు చెప్పారు. పెళ్లి చేసుకోవడానికి అనుమతించమన్నారు. మొదట్లో ఒప్పుకోకపోయినా.. తరువాత ధనుష్, సుష్మల నిష్కల్మషమైన ప్రేమను చూసిన ఇరు కుటుంబాలు వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

త్వరలో ముహూర్తాలు పెట్టుకోవడానికి రెండు కుటుంబాలు సిద్ధమయ్యాయి. అయితే ఈనెల పదకొండో తేదీన తమ ఊళ్లో జరిగే జాతర చూద్దామని ధనుష్ బైక్ పై వెళ్లాడు. కానీ నెలమంగల దగ్గర ఉన్న కులానహళి దగ్గర రోడ్డు ప్రమాదం అతడి ప్రాణాలు బలిగొంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ధనుష్ దూరమవ్వడాన్ని సుష్మ తట్టుకోలేకపోయింది. చివరి చూపు చూస్తూ.. ధనుష్ అంతక్రియల్లోనూ పాల్గొంది.

ధనుష్ మరణం సుష్మలో ఒంటరితనాన్ని పెంచింది. తనలో తానే కుమిలిపోయేలా చేసింది. ధనుష్ లేని జీవితం తనకూ వద్దని నిర్ణయించుకుంది. అది ఆత్మహత్యకు పురిగొల్పింది. పురుగుల మందు తాగింది. అది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు సుష్మను బతికించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. నాలుగైదు ఆస్పత్రులు మార్చారు. కానీ ఫలితం దక్కలేదు. మృత్యువుతో పోరాడిన సుష్మ.. ధనుష్ దగ్గరికే చేరుకుంది. ఈ విషాద ప్రేమకథ అందరికీ మనసులను కలచివేస్తోంది.