Ukraine Lady: యుద్ధాన్ని దాటి.. గోల్డ్ మెడల్ కొట్టిన ‘ఉక్రెయిన్’ మహిళ

ఓవైపు బాంబు దాడులు.. మరోవైపు తూటాల వర్షం.. ఇంట్లో ఉన్నా రక్షణ లేదు. కాలు బయటపెట్టినా బతుకుతామన్న గ్యారంటీ లేదు.

  • Written By:
  • Publish Date - March 20, 2022 / 11:24 AM IST

ఓవైపు బాంబు దాడులు.. మరోవైపు తూటాల వర్షం.. ఇంట్లో ఉన్నా రక్షణ లేదు. కాలు బయటపెట్టినా బతుకుతామన్న గ్యారంటీ లేదు. చివరకు ప్రాణాలు కాపాడుకోవాలంటే.. బంకర్లే దిక్కు. కానీ అలా ఎన్నాళ్లూ? తినడానికి తిండి లేదు.. తాగడానికి నీళ్లు లేవు. కుటుంబాలకు కుటుంబాలే ప్రాణ భయంతో అల్లాడిపోతున్నాయి. ఇది ఉక్రెయిన్ లో పరిస్థితి. అలాంటి చోటు నుంచి, అలాంటి సమయంలో వచ్చిన ఓ అమ్మాయి.. హైజంప్ లో గోల్డ్ మెడల్ కొడుతుందని ఊహించగలరా? కానీ అది జరిగింది.

యెరోస్లవా మహుచిక్‌. ఈ పేరు వినడానికి మనకు కాస్త కొత్తగానే ఉంటుంది. కానీ తను చూపించిన ధైర్యసాహసాల గురించి తెలిస్తే.. మనస్ఫూర్తిగా సలామ్ చేస్తారు. రష్యాతో యుద్ధం వల్ల ఉక్రెయిన్లకు కంటి మీద కునుకే కరవవుతోంది. రష్యన్ల దాడుల వల్ల ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో హైజంపర్ అయిన యెరోస్లవా మహుచిక్‌.. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. గోల్డ్ మెడల్ కొట్టింది. వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో పాల్గోవాలన్నది యెరోస్లవా మహుచిక్‌ కల. కానీ ఆ పోటీలు.. బెల్ గ్రేడ్ లో జరుగుతున్నాయి. యుద్ధం జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకోవాలంటే మాటలు కాదు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలే పోతాయి.

కానీ అలాంటి సమయంలో కూడా ఏమత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. పోటీల్లో పాల్గొనడం కోసం అక్కడక్కడా బంకర్లలో తలదాచుకుంటూ.. అలా 2 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఏదైనా సాధించాలన్న కసి ఉండాలే కాని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే అధిగమిస్తారంటారు. అందుకే తనకు ఎదురైన అడ్డుంకులను దాటుకుంటూ ఛాంపియన్ షిప్ లో పాల్గొంది. 2.02 మీటర్ల ఎత్తు దూకింది.. ఏకంగా స్వర్ణ పతకమే కొల్లగొట్టింది. అదీ పట్టుదల అంటే. అదీ సంకల్పమంటే. తన దేశం కష్టకాలంలో ఉన్నా సరే.. ఆ దేశానికి మంచి చేయాలని.. తనకు చేతనైన పని చేయడం ద్వారా తన దేశానికి అండగా నిలబడాలని కోరుకుంది. ఇప్పుడీ బంగారు పతకంతో అలాంటి సందేశమే ఇచ్చింది. కిందటేడాది టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న యెరోస్లవా మహుచిక్‌.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.