Wayanad Landslide: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు నేపథ్యంలో వందలాది కుటుంబాల్లో తీరని విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో శనివారం రాత్రి వరకు 219 మృతదేహాలు, 143 శరీర భాగాలను రికవరీ చేశామని అధికారులు వెల్లడించారు. ఇంకా 206మంది ఆచూకీ లభించలేదన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే వయనాడ్‌ను ఆదుకోవడంలో భాగంగా యూడీఎఫ్ ఎమ్మెల్యేలు ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (CMDRF)కు అందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేరళ ప్రతిపక్ష నేత వి.డి. సతీషన్ మాట్లాడుతూ.. యూడీఎఫ్ అన్ని పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటుందని.. జన జీవనాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషిచేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించినట్లుగా కాంగ్రెస్(Congress) 100 ఇళ్లను నిర్మించి ఇవ్వడమే కాకుండా యూడీఎఫ్ కూటమిలో ప్రధాన మిత్రపక్షమైన ఐయూఎంఎల్ కూడా పునరావాస చర్యల్లో భాగస్వామి అయిందన్నారు.
Read Also: NASA: సునీతా విలియమ్స్‌ను కాపాడేందుకు నాసాకు 14 రోజుల సమయం
కాగా, వయనాడ్ బాధితులకు( Wayanad victims) సాయమందించేందుకు దేశ వ్యాప్తంగా పలువురు వ్యక్తులు, సంస్థలు ముందుకొచ్చి విరాళాలు అందజేస్తూ తమ ఉదారత చాటుకొంటున్నారు. కొండచరియలు విరిగిపడి తీవ్రంగా నష్టపోయిన వయనాడ్‌ను పునర్నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి యూడీఎఫ్ ఆదివారం ప్రకటించింది.
మరోవైపు సీపీఎం సారథ్యంలోని అధికార ఎల్‌డీఎఫ్ ఇప్పటికే తమ ఎమ్మెల్యేలు, ఎంపీల నెల వేతనాన్ని సీఎండీఆర్‌ఎఫ్‌కు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రమేశ్ చెన్నితల ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తానన్న ప్రకటన పట్ల కేపీసీసీ చీఫ్ కె.సుధాకరన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం నిర్వహించే నిధికి డబ్బులు ఇవ్వడం అవసరం లేదన్నారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే, సీఎండీఆర్‌ఎఫ్‌కి విరాళాలు ఇచ్చే అంశంపై కాంగ్రెస్ పార్టీలో స్వల్ప అలజడి చెలరేగిన నేపథ్యంలో యూడీఎఫ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.