UAE Visa: యూఏఈలో అమల్లోకి కొత్త వీసా విధానం.. ఇండియన్స్ కు లాభమా ? నష్టమా?

యూఏఈలో ఇవాల్టి (అక్టోబర్ 3) నుంచీ కొత్త వీసా విధానం అమల్లోకి వచ్చింది. మునుపటి వీసా పాలసీలో కీలక మార్పులను చేసి.. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.

  • Written By:
  • Publish Date - October 4, 2022 / 07:15 AM IST

యూఏఈలో ఇవాల్టి (అక్టోబర్ 3) నుంచీ కొత్త వీసా విధానం అమల్లోకి వచ్చింది. మునుపటి వీసా పాలసీలో కీలక మార్పులను చేసి.. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.
కొత్త వీసా నిబంధనల్లో.. విస్తరించిన 10 సంవత్సరాల గోల్డెన్ వీసా పథకం, నైపుణ్యం కలిగిన కార్మికులకు అనుకూలమైన ఐదు సంవత్సరాల గ్రీన్ రెసిడెన్సీ, విదేశీయులు 90 రోజుల వరకు
యూఏఈలో ఉండేందుకు అనుమతించే సరికొత్త మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసాలు ఉన్నాయి. యూఏఈ వీసా విధానంలో జరిగిన మార్పులు అక్కడికి వెళ్లే పర్యాటకులతో పాటు యూఏఈలో పని చేయాలనుకునే లేదా నివసించాలనుకునే వారిపై ప్రధాన ప్రభావాన్ని చూపుతాయి. ఈ మార్పులు భారతీయులకు ఎంతో ఉపయోగపడతాయని పరిశీలకులు అంటున్నారు.ఈ నేపథ్యంలో భారతీయులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాం.

* ఐదేళ్ల గ్రీన్ వీసా

ఐదేళ్ల గ్రీన్ వీసా అనేది యూఏఈ పౌరులు లేదా వారి యజమానుల నుంచి సహాయం కోరకుండా విదేశీయులు తమను తాము స్పాన్సర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఫ్రీలాన్సర్లు, నైపుణ్యం కలిగిన కార్మికులు, పెట్టుబడిదారులు ఈ వీసాకు అర్హులు.

* స్పాన్సర్ పవర్

గ్రీన్ వీసా హోల్డర్లు వారి కుటుంబ సభ్యులకు కూడా స్పాన్సర్ చేయవచ్చు. ఇక గోల్డెన్ వీసా హోల్డర్లు కూడా కుటుంబ సభ్యులు, పిల్లలకు స్పాన్సర్ చేయవచ్చు.

* గ్రీన్ వీసా గడువు

గ్రీన్ వీసా హోల్డర్ పర్మిట్ గడువు ముగిసినట్లయితే, వారికి ఆరు నెలల వరకు గడువు ఇవ్వనున్నారు.

* గోల్డెన్ వీసా

గోల్డెన్ వీసా అనేది 10 సంవత్సరాల పాటు పొడిగించిన రెసిడెన్సీని అందిస్తుంది. దీనికి పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తులు అర్హులు.

* గోల్డెన్ వీసా హోల్డర్ల కుటుంబీకులకు..

గోల్డెన్ వీసా ఉన్నవారి కుటుంబ సభ్యులు కూడా వీసా చెల్లుబాటు అయ్యేంత వరకు హోల్డర్ మరణించిన తర్వాత కూడా UAEలో ఉండొచ్చు.

* వ్యాపారాలకు 100%

గోల్డెన్ వీసా హోల్డర్లు తమ వ్యాపారాల 100% యాజమాన్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు.

* టూరిస్ట్ వీసా

టూరిస్ట్ వీసా ఇప్పుడు విదేశీయులను 60 రోజుల పాటు యూఏఈలో ఉండడానికి అనుమతిస్తుంది.

* 90 రోజులు ఉండొచ్చు

ఐదేళ్ల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా విదేశీయులు వరుసగా 90 రోజుల పాటు యూఏఈలో ఉండేందుకు వీలు కల్పిస్తుంది.

* ఉపాధికి అనుమతి

జాబ్ ఎక్స్‌ప్లోరేషన్ వీసా స్పాన్సర్ లేదా హోస్ట్ లేకుండానే యూఏఈలో ఉపాధిని పొందేందుకు నిపుణులను అనుమతిస్తుంది.