Site icon HashtagU Telugu

KOO vs Twitter : ‘కూ’ ఖాతాను నిలిపివేసిన ట్విటర్‌..

KOO Twitter

Koo Twitter

భారత్‌ ‘దేశీ ట్విటర్‌’ (Desi Twitter) గా పేరొందిన ‘కూ’ (KOO) ప్లాట్‌ఫామ్‌కు చెందిన ఓ ఖాతాపై ట్విటర్‌ (Twitter) వేటు వేసింది. యూజర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన ‘కూ ఎమినెన్స్’ (@kooeminence) ఖాతాను ట్విటర్‌ శుక్రవారం నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు జర్నలిస్టుల ట్విటర్‌ ఖాతాలను సస్పెండ్‌ చేసిన క్రమంలోనే ఈ పరిణామం కూడా చోటుచేసుకుంది.

‘కూ’ సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించాలనుకునే వారి సందేహాలు నివృత్తి చేసేందుకు కొద్ది రోజుల క్రితమే కూ ఎమినెన్స్ (@kooeminence) పేరుతో ట్విటర్‌ లో ఖాతా తెరిచారు. ఈలోపే ట్విటర్‌ (Twitter) ఈ ఖాతాను నిలిపివేయడం గమనార్హం. ఈ పరిణామంపై ‘కూ’ సహ వ్యవస్థాపకుడు మయాంక్‌ అసహనం వ్యక్తం చేశారు. ‘‘ప్రజలకు అందుబాటులో ఉండే సమాచారాన్ని పోస్ట్‌ చేయడం డాక్సింగ్‌ (Doxxing) కిందకు రాదు. జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వారిని మాధ్యమం నుంచి తొలగించడం చెత్త విషయం. మీ ఒక్కరికి (ట్విటర్‌ ను ఉద్దేశిస్తూ) మాత్రమే నచ్చే విధానాలను రూపొందించడం దారుణం.

ఏ రోజు కా రోజు మీ సిద్ధాంతాలను మార్చుకోవడం అస్థిరత్వం. చర్చలను నియంత్రించేందుకు రాత్రికి రాత్రే ఖాతాలను తొలగిస్తున్నారు. ఇలా వివరించుకుంటూ పోతే ట్విటర్‌ చర్యలు ఇంకెన్నో. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఆధిపత్యం కోసమే ఇలా చేస్తున్నారు. దీన్ని ఎన్నటికీ అనుమతించకూడదు. దీనిపై గళమెత్తాలి’ అని మయాంక్‌ ట్విటర్‌ పై మండిపడ్డారు. తమ మాధ్యమంలో ఎన్నడూ పక్షపాత ధోరణిలో
విధానాలను రూపొందించలేదని మయాంక్‌ ఈ సందర్భంగా తెలిపారు. ట్విటర్‌ ఇక ‘మాధ్యమం’గా వ్యవహరించబోదని.. పబ్లిషర్‌గా మారిందని ఆయన దుయ్యబట్టారు. ట్విటర్‌కు ఉత్తమమైన ప్రత్యామ్నాయం ‘కూ’ (Koo) ప్లాట్‌ఫామ్‌ అని తెలిపారు.

యూజర్ల వ్యక్తిగత వివరాలను పంచుకోవడాన్ని నిషేధిస్తూ ట్విటర్‌ (Twitter) నిబంధనలు రూపొందించింది. వీటినే డాక్సింగ్‌ రూల్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతో పలువురు జర్నలిస్టుల ఖాతాలను ట్విటర్‌ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇందులో అమెరికాలో ప్రధాన పత్రికలైన న్యూయార్క్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌కు చెందిన పాత్రికేయుల ఖాతాలతో పాటు ట్విటర్‌కు పోటీగా వచ్చిన మాస్టోడాన్‌ ఖాతా కూడా ఉండటం గమనార్హం.

Also Read:  Smriti Irani : కాషాయ బికినీ ధరించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..