Site icon HashtagU Telugu

Train Driver Sacrifice: 144 మందిని కాపాడి.. అమరుడయ్యాడు.. హీరో ట్రైన్ డ్రైవర్ కు సంతాపాల వెల్లువ!!

Train

Train

అది బుల్లెట్ ట్రైన్ .. వాయు వేగంతో దూసుకెళ్తోంది.. కాసేపు అయితే స్టేషన్ లో దిగిపోతామని అందరూ అనుకుంటున్నారు.. ముందు ఒక ప్రమాదం పొంచి ఉందని వారికి తెలియదు.. అకస్మాత్తుగా రైలు పట్టాలపై రాళ్ళ కుప్పలు, బురద కనిపించాయి. దీన్ని కొంత దూరం నుంచే గుర్తించిన ట్రైన్ డ్రైవర్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. రైలు పట్టాలు తప్పడం ఖాయమని తెలిసినా.. ప్రాణాలకు తెగించి మరీ చివరి ప్రయత్నంగా బ్రేక్ వేశాడు. అతడి ప్రయత్నం ఫలించింది. రైలు పట్టాలు తప్పినా.. డ్రైవర్ బోగీ మాత్రమే తీవ్రంగా దెబ్బతింది. రెండు బోగీల్లోని 144 మంది ప్రయాణికులను రక్షించి, డ్రైవర్ ఒక్కడు అమరుడయ్యాడు. కేవలం 8 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. చైనా లోని గ్విఝౌ ప్రావిన్స్ పరిధిలో ఈ ప్రమాదం సంభవించింది.

144 మందిని కాపాడి..

144 మంది ప్రయాణికులను కాపాడేందుకు తన ప్రాణాలిచ్చిన ఆ డ్రైవింగ్ హీరో పేరు యాంగ్ యంగ్ (Yang Yong). ఇప్పుడు అతడి గురించి యావత్ చైనా లో చర్చ జరుగుతోంది. అతడి భౌతిక కాయంతో స్వగ్రామానికి వచ్చిన అంబులెన్స్ కు స్థానిక పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. స్థానిక ప్రజలు కూడా రోడ్లకు ఇరువైపులా నిలబడి సెల్యూట్ చేశారు. చైనా సోషల్ మీడియాలోనూ యాంగ్ యంగ్ త్యాగ నిరతి హాట్ టాపిక్ గా మారింది. ప్రమాదానికి గురైన
D2809 నంబర్ బుల్లెట్ ట్రైన్ పై హాట్ డిబేట్ జరుగుతోంది.

ఎవరీ యాంగ్ యంగ్..

యాంగ్ యంగ్ మాజీ సైనికుడు. 1993 నుంచి 1996 వరకు ఆర్మీ లో పనిచేశాడు. మంచి స్క్వాడ్ లీడర్ గా అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత చైనా రైల్వే లో యాంగ్ యంగ్ కు ఉద్యోగం వచ్చింది. అసిస్టెంట్ డ్రైవర్ స్థాయి నుంచి డ్రైవర్ స్థాయికి ఎదిగాడు.

Exit mobile version