AP : ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖ జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బదిలీల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. బదిలీలకు సంబంధించి తొలుత 16 నుంచి 18వ తేదీ వరకు హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందులో ప్రతి ఉద్యోగి ఎక్కడి పోస్టులో, ఎంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడో వివరాలను సేకరించనున్నారు. అలాగే, హేతుబద్ధీకరణ అనంతరం ఏఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో కూడా ఖరారు చేయనున్నారు.
Read Also: Air India : అహ్మదాబాద్ టు లండన్..మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
అంతేకాక, 22 నుంచి 24వ తేదీ వరకు ఉద్యోగులు బదిలీల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం 25 నుంచి 29వ తేదీ వరకు ఒకే చోట ఐదేళ్లకుపైగా పనిచేస్తున్న వారి వివరాలను పరిగణనలోకి తీసుకొని కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను అమలు చేయనున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా, వాటిని జిల్లా కలెక్టర్లు 30వ తేదీన పరిష్కరించనున్నారు. ఈ బదిలీ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్న ఉద్దేశంతో షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ, పలువురు ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో ఐక్యత లోపంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సచివాలయ ఉద్యోగులు, ఈసారి జరిగే బదిలీలలో రాజకీయ హస్తం పెరుగుతోందని గమనిస్తున్నారు.
అనేకమంది ఉద్యోగులు తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో బదిలీ పొందేందుకు స్థానిక రాజకీయ నేతల సిఫార్సులతో లెటర్లు తెచ్చుకుంటున్నారని సమాచారం. దీని వల్ల బదిలీల ప్రక్రియ సీనియారిటీ కన్నా సిఫార్సులకు అధిక ప్రాధాన్యం లభించేలా మారుతుందన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. సాధారణంగా బదిలీలను సీనియారిటీ ఆధారంగా పాయింట్ల విధానంలో నిర్వహించాలి. అయితే ప్రస్తుతం లెటర్ల ఆధారంగా ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుండటంతో, కొంతమంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒకే పోస్టుకు అనేకమంది పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగుల మధ్య భిన్నాభిప్రాయాలు, మనస్పర్థలు తలెత్తే అవకాశం ఉంది.
దీంతో సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం ఏమిటంటే టీచర్ల బదిలీల తరహాలో, సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చే పాయింట్ ఆధారిత విధానంతో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలి. పారదర్శకంగా, న్యాయంగా జరిగే బదిలీలే ఉద్యోగుల్లో విశ్వాసం పెంపొందించగలవని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఒక క్లారిటీ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసి, బదిలీల ప్రక్రియను నిర్దిష్టంగా అమలు చేయాలన్నది ఉద్యోగుల డిమాండ్. కౌన్సెలింగ్ ప్రక్రియలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటేనే ఈ మార్పులు ఆచరణకు వస్తాయని స్పష్టమవుతోంది.
Read Also: Russia- Ukrain : ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడ్డ రష్యా..14 మంది మృతి