Rahul Gandhi : అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మాట్లాడారు. దళితులు, ఆదివాసీలకు న్యాయం జరుగుతోందా అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని రాహుల్ విమర్శించారు. దేశ సమస్యలు తీర్చాలంటే.. దేశాన్ని ఎక్స్‌రే తీయాలని అన్నారు. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి మార్గం చూపింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అంశాన్ని తొలగిస్తాం. తెలంగాణలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. తెలంగాణ సంపదలో మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన భాగస్వామ్యం లేదు. వారి జనాభాకు అనుగుణంగా సంపదలోనూ తగిన వాటా అవసరం అని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Bandhan Bank : ఎలీట్ ప్లస్ సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించిన బంధన్ బ్యాంక్
రేవంత్‌రెడ్డి పంపిన బిల్లుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణలో కులగణనను విజయవంతంగా నిర్వహించారు. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కులగణన వల్ల దేశంలో బీసీల సంఖ్య ఎంతో తెలుస్తుంది. చనిపోయాక నా గురించి ప్రజలు ఏం ఆలోచిస్తారనేది అనవసరం. నేను అనుకున్న పనులు పూర్తి చేశాక ప్రజలు మరిచిపోయినా నాకు అభ్యంతరం లేదు. బీసీల రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిల్లు కేంద్రానికి పంపారు.
దేశంలో కులగణన చేపట్టాలని ప్రధాని మోడీని కోరాం. దీనికి ప్రధాని సహా ఆర్ఎస్‌ఎస్ తిరస్కరించింది. లౌకిక భావనకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకం. దళితుడైన రాజస్థాన్ పీసీసీ నేతను ఆలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛపై దాడి అని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రధాని మోదీ ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నారు. ఇద్దరు వ్యాపారవేత్తలకే వాటిని అప్పగిస్తున్నారు. ఎయిర్‌పోర్టులు, గనులు, సిమెంట్, స్టీల్ సహా కీలక పరిశ్రమలన్నీ ఓ పారిశ్రామికవేత్తకే కట్టబెడుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో భాజపా అక్రమాల ద్వారా గెలిచింది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ రోజూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి.