Site icon HashtagU Telugu

Service Charge: రెస్టారెంట్లలో “సర్వీసు” చార్జీ కట్టాలా ? వద్దా? 

Food

Food

మీరు ఏదైనా హోటల్ కో.. రెస్టారెంట్ కో వెళ్ళినప్పుడు తీసుకున్న బిల్లును గమనించారా ? అందులో సర్వీస్ చార్జీ కూడా కలిసి ఉందా? వాస్తవానికి మీరు ఆ సర్వీసు ఛార్జీని కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ దాన్ని కట్టాల్సిందే అని హోటల్ లేదా రెస్టారెంట్ యాజమాన్యం బలవంతం చేస్తే మీరు నిరాకరించవచ్చు. వారి ఈ చర్యకు వ్యతిరేకంగా వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించవచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీ బలవంతంగా వసూలు చేయరాదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

త్వరలోనే దీనికి సంబంధించిన చట్టపరమైన విధానాలను రూపకల్పన చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ యోచిస్తోంది. దేశంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు దాదాపు 5 నుంచి 10 శాతం మేర సర్వీస్ ఛార్జీని వినియోగదారుల ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో సర్వీస్ చార్జీల బాదుడుకు బ్రేక్ వేసే విధి విధానాలను రూపొందించాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. వాస్తవానికి 2017 లో కేంద్ర ప్రభుత్వం హోటళ్లు, రెస్టారెంట్ల కు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కూడా.. అవి సర్వీస్ చార్జీలు వసూలు చేయడం చెల్లుబాటు కాదు. వినియోగదారులే స్వయంగా టిప్ ఇస్తే మాత్రం తీసుకోవచ్చు. ఒకవేళ తమ కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇవ్వాలని భావిస్తే మాత్రం మెనూ కార్డులో రేట్లు పెంచుకోవచ్చు.

Exit mobile version