KTR Key Statements about Musi River Development: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి ఫతేనగర్, కూకట్‌పల్లిలోని మురుగు నీటి శుద్ధి కేంద్రాలను పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఎస్టీపీల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. కూకట్‌పల్లి ఎస్టీపీని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా కూకట్‌పల్లి నాలాను శుద్ధి చేయాలని సూచించారు.
Read Also: Hyderabad : సంక్షోభంలో హైదరాబాద్ ..?
హైదరాబాద్ ను మురికినీటి రహిత నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంగా తమ ప్రభుత్వ హయాంలో ఎస్టీపీలను ప్రారంభించామని పేర్కొన్నారు. మొత్తం తమ హయాంలో రూ.3,866 కోట్లతో 31 ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టామని గుర్తు చేశారు. మూసీ సుందరీకరణ పేరులో కాంగ్రెస్ సర్కార్ రూ.వేల కోట్ల స్కాంకు తెర లేపిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ పనులను సైతం ఓ పాకిస్తాన్ కంపెనీకి అప్పగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఫతేనగర్ ఎస్టీపీల్లో(మురుగు శుద్ధి కేంద్రం) శుద్ధి చేసిన నీరంతా మూసీ నదిలోకి వెళ్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. దాదాపు 94శాతం స్వచ్ఛమైన నీరు మూసీలోకి వెళ్తున్నపుడు మళ్లీ మూసీ శుద్ధి ఎందుకని కేటీఆర్ నిలదీశారు.
కాగా, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చలేదన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూం విషయంలో ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేశారన్నారు. ఇక, హైడ్రా పేరుతో పేదలకు ఒక న్యాయం, ధనవంతులకు మరో న్యాయం చేస్తున్నారని విమర్శలు చేశారు. అలాగే ఎస్టీపీల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు.