Thieves Nightmares: పీడ కలలు వస్తున్నాయి, గుడిలో దొంగలించిన అష్టధాతు విగ్రహాలు తిరిగి ఇచ్చేసిన దొంగలు..

చేసిన పాపం ఊరికే పోదు అంటారు పెద్దలు, ఓ దేవాలయంలో కోట్లు విలువ చేసే అష్టధాతు విగ్రహాలను దొంగిలించిన దొంగలకు అదే గతి పట్టింది.

  • Written By:
  • Publish Date - May 17, 2022 / 05:30 AM IST

చేసిన పాపం ఊరికే పోదు అంటారు పెద్దలు, ఓ దేవాలయంలో కోట్లు విలువ చేసే అష్టధాతు విగ్రహాలను దొంగిలించిన దొంగలకు అదే గతి పట్టింది. నేరం చేసిన తర్వాత తమకు పీడకలలు వస్తున్నాయని పేర్కొంటూ దొంగలు 14 దొంగిలించబడిన ‘అష్టధాతు’ విగ్రహాలను ఇక్కడి పురాతన బాలాజీ ఆలయ పూజారికి తిరిగి ఇచ్చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఓ విచిత్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది, కొందరు దొంగలు మొదట ఆలయంలో కొన్ని కోట్లు విలువ చేసే 14 అష్టధాతు విగ్రహాలను దొంగిలించారు, ఆపై వాటిని ఆ గుడి పూజారి నివాసం సమీపంలో వదిలి వెళ్లారు.

మే 9న విగ్రహాలు చోరీకి గురయ్యాయి
పూర్తి వివరాల్లోకి వెళితే, మే 9 న, చిత్రకూట్ జిల్లాలోని సదర్ కొత్వాలి ప్రాంతంలోని తరౌన్హాలో ఉన్న పురాతన బాలాజీ ఆలయం నుండి 14 అష్టధాతు విగ్రహాలు దొంగతనానికి గురయ్యాయి. దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా విచిత్రంగా మే 15, ఆదివారం పూజారి ఇంటి బయట ఈ విగ్రహాలను దొంగలు వదిలేశారు. విగ్రహాలతో పాటు ఓ లేఖను కూడా దొంగలు వదిలేశారు. ఈ లేఖపై, ‘మాకు రాత్రిపూట భయంకరమైన కలలు వస్తున్నాయి, కాబట్టి మేము పూజారి నివాసం వెలుపల విగ్రహాలను ఉంచాము అని రాసి ఉంది.

ఈ విగ్రహాల విలువ కోట్లాది రూపాయలు
పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రాజీవ్ కుమార్ సింగ్ సోమవారం మాట్లాడుతూ, ‘మే 9 రాత్రి, తరౌహాలోని పురాతన బాలాజీ ఆలయంలో కోట్లాది రూపాయల విలువైన 16 అష్టధాతు విగ్రహాలు చోరీకి గురయ్యాయి. దీనికి సంబంధించి మహంత్ రాంబాలక్ గుర్తు తెలియని దొంగలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

పీడ కలలకు భయపడి దొంగలు విగ్రహాలను తిరిగి ఇచ్చారు
రాజీవ్ కుమార్ సింగ్ ప్రకారం, దొంగిలించిన 16 విగ్రహాలలో 14 మహంత్ రాంబాలక్ నివాసం వెలుపల గోనె సంచిలో ఆదివారం రహస్యంగా కనుగొన్నారు. విగ్రహాలతో పాటు దొంగలు రాసిన లేఖ కూడా లభ్యమయ్యాయి, అందులో ‘మాకు రాత్రిపూట భయంకరమైన కలలు వస్తుంటాయి. భయంతో విగ్రహాలను తిరిగి ఇస్తున్నాం. ప్రస్తుతం మొత్తం 14 విగ్రహాలు స్టేషన్ లో జప్తు చేసుకున్నామని దీనిపై విచారణ జరుపుతున్నట్లు సింగ్ తెలిపారు.