2024 – Career Options : న్యూ ఇయర్‌లో యువత ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఉద్యోగ అవకాశాలను కల్పించే కొత్తకొత్త మార్గాల కోసం ఎంతోమంది నిరుద్యోగులు వెతుకుతున్నారు. ఇటువంటి వారికి కొత్త ఏడాది కొత్త తలుపులను తెరుస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవంతో నడుస్తున్న ఈ యుగంలో టెక్ నాలెడ్జ్ పెంచుకునే వారికి ఉద్యోగ అవకాశాలు కోకొల్లలుగా వస్తున్నాయి. అలాంటి జాబ్ ఆపర్చునిటీస్‌ను అందించే కెరీర్ ఆప్షన్ల(2024 – Career Options) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డిజిటల్ మార్కెటర్
డిజిటల్ మీడియా హవా నడుస్తున్న తరుణమిది. ప్రజలంతా నిత్యం సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో బిజీగా గడుపుతున్నారు. దీన్ని అదునుగా వాడుకొని వ్యాపారం, సేవల రీచ్‌ను పెంచే టెక్నిక్‌ను డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఎస్ఈఓ, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, కంటెంట్ రైటింగ్, ఈ-మెయిల్ మార్కెటింగ్‌లపై పట్టు ఉన్నవారికి మంచి జాబ్స్ లభిస్తాయి. ప్రస్తుతం ఈ స్కిల్స్ ఉన్నవారు ఏడాదికి సగటున రూ.4 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా సంపాదిస్తున్నారు.
సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్
టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో.. అంతే వేగంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు సైబర్ సెక్యూరిటీ అనలిస్టులు అవసరం. సైబర్ అటాక్‌లు, సైబర్ ఫ్రాడ్‌లను అరికట్టడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. అందుకే ఐటీ, డిఫెన్స్, బ్యాంకింగ్ లాంటి రంగాల్లోనూ వీరి రిక్రూట్‌మెంట్స్ జరుగుతున్నాయి. భవిష్యత్‌లో వీరికి మరింత డిమాండ్ పెరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ అనలిస్టులకు ఏటా రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా శాలరీ వస్తుంది.
డేటా సైంటిస్ట్
డేటా సైంటిస్టులకు ఏటా రూ.14 లక్షల నుంచి రూ.25 లక్షల దాకా శాలరీ ఇస్తున్నారు. దీన్నిబట్టి నేటి మార్కెట్‌లో వీళ్లకు ఉన్న డిమాండ్‌ను మనం అర్థం చేసుకోవచ్చు.ఏదైనా ఎంపిక చేసుకున్న విభాగం, రంగంలోని కార్యకలాపాలకు సంబంధించిన డేటాను వీరు సేకరించి చక్కగా విశ్లేషిస్తారు. దాన్ని అర్థమయ్యేలా ప్రజెంట్ చేస్తారు. ఆ సమాచారంతో చక్కటి నివేదికను తయారు చేసి అందిస్తారు. ఆన్‌లైన్, డిజిటల్ వ్యాపార వ్యూహాల రూపకల్పనకు ఈ నివేదికలు కీలకంగా మారుతాయి.
We’re now on WhatsApp. Click to Join.
గ్రీన్ స్పెషలిస్ట్
వ్యవసాయం, నిర్మాణం, రవాణా, వ్యర్థాల నిర్వహణ, ఎనర్జీ, వేస్ట్ మేనేజ్మెంట్, పరిశోధన, కన్సల్టింగ్, పాలసీ మేకింగ్‌లలో గ్రీన్ స్పెషలిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. పారిశ్రామిక కాలుష్యం, మానవ తప్పిదాల వల్ల పర్యావరణానికి కలిగే హానిని అరికట్టేందుకు గ్రీన్ స్పెషలిస్టులు అవసరం. వీరికి ఏటా రూ.4 లక్షల నుంచి రూ.40 లక్షల దాకా శాలరీలు లభిస్తాయి.
ఏఐ అండ్ ఎంఎల్ ఇంజినీర్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా ఎంతగా నడుస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏఐపై ఆధారపడే సాఫ్ట్‌వేర్లకు, ఆన్‌లైన్ టూల్స్‌కు బాగా గిరాకీ పెరిగింది. ఈనేపథ్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషీన్ లెర్నింగ్ (ML)పై అవగాహన కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ స్కిల్స్ ఉన్నవాళ్లు ఏఐ సాయంతో ఆటోమేటిక్‌గా పనులు పూర్తి చేసే యాప్‌లను తయారు చేస్తారు. ఫలితంగా తక్కువ శ్రమతో, పెద్ద మొత్తంలో ఉత్పత్తులను తయారుచేయడానికి, సేవలను అందించడానికి వీలు కలుగుతుంది. ఏఐ అండ్ ఎంఎల్ సంవత్సరానికి రూ.11 లక్షల నుంచి రూ.21 లక్షల దాకా శాలరీ ఇస్తున్నారు.