Inter Exams: నిమిషం నిబంధన ఎత్తివేయాల్సిందే.. ఇంటర్ బోర్డుపై సర్వత్రా విమర్శలు

  • Written By:
  • Updated On - March 2, 2024 / 12:45 AM IST

Inter Exams: తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాగా.. కొత్తగా నిమిషం నిబంధన అమల్లోకి తెచ్చారు. నిర్థిష్ట సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతించరు. తొలిసారి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు దీనిపై పెద్దగా అవగాహన లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సులు సమయానికి రాకపోవడం తదితర కారణాలతో తొలిరోజు, మలిరోజు చాలామంది విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయారు. వారు వచ్చేసరికి గేట్లకు తాళాలు వేసి ఉండటంతో అవాక్కయ్యారు.

ప్రభుత్వ నిబంధనల మేరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించలేదు. కాళ్లావేళ్లాపడి బ్రతిమిలాడినా వారిని అనుమతించకపోవడంతో విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. బస్సు ఆలస్యంగా వచ్చిందని కొందరు, అనారోగ్య కారణాలతో మరికొందరు రాలేకపోయామని ఏడ్చారు. నిబంధనలు మీరి తామేమీ చేయలేమని పరీక్షా కేంద్రం నిర్వాహకులు చెప్పడంతో వారు వెనుదిరిగారు. ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన తొలగించాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నిమిషం నిబంధన కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించాయి.

తెలిసీ తెలియని కౌమారదశ..ఆలోచనా పరిజ్ఞానం అంతగా పరిణితి చెందని ఆ వయస్సులో చిన్నచిన్న తప్పులకే పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. చిన్న అవమానాన్ని కూడా భరించలేని కూడా వారి మనసు తట్టుకోలేదని పరీక్షల్లో ఒక్క మార్కు తక్కువ వస్తేనా భరించలేని వాళ్లు ఏడాదింతా కష్టపడి చదివి నిమిషం ఆలస్యం కారణంగా పరీక్ష రాయలేకపోతే వారి హృదయం ఎంత తల్లడిల్లిపోతుందని అంటున్నారు.