Court Named Child : పిల్లలకు పేర్లు పేరెంట్సే పెట్టుకుంటారు. కానీ ఓ పాపకు కోర్టు జోక్యం చేసుకొని పేరు పెట్టింది. ఇంతకీ ఆ పాపకు కోర్టు పేరు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ? ఏం జరిగింది ? ఇప్పుడు తెలుసుకుందాం.. కేరళకు చెందిన దంపతులకు 2020 ఫిబ్రవరిలో ఓ పాప పుట్టింది. అప్పటికే జరిగిన గొడవల కారణంగా ఆ పాప పేరెంట్స్ వేర్వేరుగా ఉంటున్నారు. తల్లి వద్దే పాప ఉంటోంది. బర్త్ సర్టిఫికెట్‌లో పాప పేరును నమోదుచేయాలంటే తల్లిదండ్రులిద్దరూ హాజరుకావాలని అధికారులు స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి అధికారుల దగ్గరికి వెళ్లారు. కానీ ‘పుణ్య నాయర్’ అనే పేరును భార్య సూచించగా.. ‘పద్మ నాయర్’ అనే పేరును భర్త సూచించాడు. ఇరువురూ ఈ విషయంలో పట్టువీడకపోవడంతో పాప తల్లి కేరళ హైకోర్టును ఆశ్రయించారు.
Also read : SIM Card Rule: కొత్త సిమ్ కార్డు కొంటున్నారా? ఈ మార్గదర్శకాలు తెలుసుకోవాల్సిందే!
ఈ కేసు విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెచు కురియన్ థామస్ తన అధికార పరిధిని వినియోగించుకొని ఈ సమస్యను పరిష్కరించారు. తల్లి సూచించిన పేరుతో పాటు తండ్రి పేరునూ జత చేసి, పాపకు ఓ పేరును ఖరారు చేశారు. పాపకు తల్లిదండ్రుల పేర్లు కలిసొచ్చేలా ‘పుణ్య బాలగంగాధరన్ నాయర్’ అనే పేరు పెట్టారు. తల్లిదండ్రుల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి సమయం పడుతుందని, ఈలోగా పేరు లేకపోవడం పిల్లల ప్రయోజనాలకు అనుకూలంగా ఉండదని (Court Named Child) న్యాయమూర్తి ఈసందర్భంగా కామెంట్ చేశారు.