Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర.. భద్రతా బలగాలు అలర్ట్

అమర్‌నాథ్ యాత్రపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - June 6, 2023 / 05:07 PM IST

అమర్‌నాథ్ యాత్ర.. మనదేశంలోనే పవిత్రమైన యాత్ర. ఈ యాత్ర కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. అయితే ఈ యాత్రపై ఉగ్రవాదుల కన్ను పనడిట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లోని యాత్రపై పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నారని వివిధ వర్గాల సమాచారం. యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఉగ్రవాదులు భద్రతా బలగాలను, అమర్‌నాథ్ యాత్ర కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే అవకాశం ఉందని వివిధ వర్గాలు తెలిపాయి.

అమర్‌నాథ్ యాత్రపై దాడి చేసేందుకు రఫీక్ నాయ్, మహ్మద్ అమీన్ బట్ అలియాస్ అబూ ఖుబైబ్‌ లు అనే ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజౌరీ-పూంచ్, పీర్ పంజాల్, చీనాబ్ వ్యాలీ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుబోతున్నట్టు సమాచారం. రఫీక్ నాయ్ పూంచ్ జిల్లాలోని మెంధార్ నివాసి కాగా, ఖుబైబ్ దోడా జిల్లా వాసి. ప్రస్తుతం, ఇద్దరూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) నుండి పనిచేస్తున్నారు.

ఉగ్రవాదులు ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా దోడా, పూంచ్ ప్రాంతాల యువకులను ఆకర్షిస్తున్నారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్ల (OGWs) సంఖ్యను పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. యువతను ఉగ్రవాదంలోకి దింపేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అమర్‌నాథ్ యాత్ర పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. స్క్వాడ్ టీమ్‌లు, క్యూఆర్‌టి, సిఆర్‌పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఎస్‌ఎస్‌బి, అలాగే అనేక ఇతర భద్రతా ఏజెన్సీలు యాత్రికుల భద్రతకు కోసం రంగంలోకి దిగాయి. దాదాపు  62 రోజుల పాటు కొనసాగే అమర్ నాథ్ యాత్ర ఆగస్టు 31, 2023న ముగుస్తుంది.

Also Read: Ram & Sreeleela: మైసూర్ లో రామ్, శ్రీలీల సందడి, ఫొటోలు వైరల్!