CM Revanth Reddy : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర 7వేల పై చిలుకు కోట్ల అప్పు కోసం కేబినెట్ అనుమతిపై చర్చించారు. 30వేల కోట్లు కేంద్ర సంస్థల దగ్గర రుణాలు తీసుకోవడం కోసం..రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రోడ్లు తనఖా పెట్టడానికై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపుపై చర్చ జరిగింది. ములుగులో గిరిజన యూనివర్సిటీకి ఎకరా 250 రూపాయల చొప్పున భూమిని మంత్రివర్గం కేటాయించినట్లు సమాచారం.
మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసేందుకు మంత్రి మండలి అంగీకరించింది. అలాగే, హన్మకొండ , వరంగల్ జిల్లాల పరిధి పెంపునకు ఆమోదం తెలిపింది. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు గ్రీనిసిగ్నల్ ఇచ్చింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్‌పై చర్చించిన కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కాగా, మరో రెండు రెండు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవునున్న నేపథ్యంలో ఈరోజు కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల హామీలు సహా మేనిఫెస్టోపై కేబినెట్ చర్చించింది. ఇప్పటి వరకు వేసిన కేబినెట్ సబ్ కమిటీలు, వాటి నివేదికలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.