Donald Trump : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దిగుమతి చేసుకొనే కార్లపై సుంకాలు విధించే యోచనలో ఉన్నట్లు శుక్రవారం తెలిపారు. అయితే ఆటోమొబైల్ ఉత్పత్తులన్నింటిపైనా సుంకాలు విధిస్తారా? లేదా అనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. దిగుమతి చేసుకొనే కార్లపై సుంకాలను విధించడం ద్వారా ఆదాయాన్ని పెంచడంతో పాటు, వాణిజ్య అసమతుల్యతను తగ్గించవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
Read Also: RCB Record: అద్భుత విజయంతో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
ఏప్రిల్ 2 నుండి ఆటోమొబైల్ ఉత్పత్తులపై టారిఫ్‌లు అమలులోకి రావొచ్చని సూచించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు. అమెరికాలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు 50 శాతం దేశంలోనే తయారవుతాయి. ఆటోమొబైల్ ఉత్పత్తుల దిగుమతుల్లో సగం మెక్సికో, కెనడా ఇతర దేశాల నుంచి వస్తున్నాయి. జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ నుంచి కొంతమేరకు దిగుమతులు ఉన్నా బ్రిటన్, ఇటలీ, స్వీడన్ నుంచి తక్కువగానే ఆటోమొబైల్ ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి.
ట్రంప్ సుంకాల విధింపు విధానంతో ఆటోమొబైల్ పరిశ్రమలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫర్లీ పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం సుంకాల పెంపు విధానం,ఎలక్ట్రిక్ వాహనాలపై వ్యతిరేక వైఖరి వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు. అమెరికాలో వాహన తయారీని ప్రోత్సహించాలని ట్రంప్ ప్రకటించినప్పటికీ,ఈ విధానంతో పరిశ్రమలో అనిశ్చితి నెలకొంటుందని అభిప్రాయపడ్డారు.
కాగా, డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాలు ప్రపంచంలోని చాలా దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఇతర ప్రధాన దేశాలు తప్పకుండా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ దూకుడు ప్రపంచ వ్యాపార నాయకుల ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తోంది. అయితే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.