Jayalalitha Death Mystery : సీఎం అవ్వడానికి ముందు రోజు రాత్రి జయలలిత ఇంటికి డాక్టర్ ఎందుకు వెళ్లారు?

జయలలిత చనిపోవడానికి ముందు ఏం జరిగింది? 2016 నుంచి ఇప్పటివరకు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

  • Written By:
  • Publish Date - March 8, 2022 / 10:55 AM IST

జయలలిత చనిపోవడానికి ముందు ఏం జరిగింది? 2016 నుంచి ఇప్పటివరకు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత కొన్ని రోజులకే తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో జయను అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. తరువాత 75 రోజుల పాటు ట్రీట్ మెంట్ ఇచ్చారు. కానీ 2016 లో సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు రోజు రాత్రి ఏం జరిగింది? హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్ ముందు అపోలో వైద్యులు దీని గురించి ఏం చెప్పారు?

జయలలిత మృతికి సంబంధించిన మిస్టరీ ఐదేళ్లు దాటినా ఇంకా వీడలేదు. జయ మృతిపై వివిధ వర్గాల్లో అనుమానాలు ఉండడంతో అప్పటి పళనిస్వామి ప్రభుత్వం.. జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ అప్పుడే విచారణ ప్రారంభించింది. కానీ అపోలో ఆసుపత్రి సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ కేసు విచారణ నిలిచిపోయింది. ఇప్పుడు సుప్రీం ఆదేశాలతో కమిషన్ మళ్లీ విచారణను ప్రారంభించింది.

కమిషన్ ముందు హాజరైన వైద్యులు ఇచ్చిన స్టేట్ మెంట్ లో అత్యంత కీలకమైన విషయాలు ఉన్నాయి. 2016 శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తరువాత జయలలిత రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పటికే ఆమె అనారోగ్యం పాలయ్యారు. దీంతో ప్రమాణస్వీకారం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని అపోలో ఆసుపత్రి వైద్యుడు బాబూమోహన్ కమిషన్ ముందు చెప్పారు. దీంతో తాత్కాలికంగా ఉపశమనం పొందేలా మందులను తీసుకుని కార్యక్రమానికి వచ్చారన్నారు..

జయలలిత అప్పటికే సొంతంగా నడవలేని పరిస్థితిలో ఉన్నారని.. ఎక్కువగా స్పృహ కోల్పోయేవారని చెప్పారు. దీనివల్ల మూర్చపోయేవారన్నారు. అప్పుడే ఆమెకు కొడనాడు ఎస్టేట్ లో విశ్రాంతి తీసుకోమని చెప్పానని అయినా జయ వినలేదన్నారు. రోజుకు 16 గంటల చొప్పున పని చేస్తున్న తాను విశ్రాంతి తీసుకోవడం సాధ్యపడదని చెప్పారన్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా మరోమారు బాధ్యతలు చేపట్టడానికి ముందు రోజు.. ఆమె వ్యక్తిగత వైద్యుడు శివకుమార్ పిలవడంతో తాను కూడా పోయెస్ గార్డెన్ కు వెళ్లానన్నారు. అయితే ఆమె సొంతంగా నడవలేని పరిస్థితిలో కనిపించారన్నారు.

జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ విచారణ ప్రారంభించడంతో.. జయ మృతి కేసు మళ్లీ వార్తల్లో నిలిచింది. జయలలితది సహజమరణమా కాదా అన్న అనుమానాలు వివిధ వర్గాల్లో ఉండడంతో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ కేసులో విచారణ మళ్లీ ప్రారంభించడంతో అపోలో ఆసుపత్రికి చెందిన 11 మంది వైద్యులు.. కమిషన్ ముందు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది.