Site icon HashtagU Telugu

T-SAT : కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు టి-సాట్ ఆన్ లైన్ కోచింగ్..

T-SAT Online Coaching for Constable Competitive Exams..

T-SAT Online Coaching for Constable Competitive Exams..

T-SAT Online Coaching : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ భర్తీ చేసే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు అన్ లైన్ కోచింగ్ అందించనున్నామని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 21వ తేదీ సోమవారం నుండి జనవరి 31వ తేదీ వరకు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ద్వార అన్ లైన్ కంటెంట్ అందించనున్నామన్నారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 2024 సెప్టెంబర్ ఆరవ తేదీన 39,481 జి.డి కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని సీఈవో గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా నియామకం జరిగే కానిస్టేబుల్ ఉద్యోగాలలో 35,612 మంది పురుషులు, 3,869 మంది మహిళలకు అవకాశం లభించనుండగా తెలంగాణకు చెందిన 718 మందికి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 908 మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అన్ని వర్గాల యువత కోసం టి-సాట్ ప్రత్యేక పాఠ్యాంశ ప్రణాళికను రూపొందించి ప్రసారం చేయాలని నిర్ణయించిందని, అందులో భాగంగానే పోటీ పరీక్షల కోసం నాణ్యమైన ఆన్ లైన్ కంటెంట్ అందిస్తున్నామని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అరగంట నిడివి గల 448 ఎపిసోడ్స్ 224 గంటల్లో 112 రోజులు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు, యూట్యూబ్, యాప్ ద్వార అందించనున్నామన్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే నాలుగు సబ్జెక్టులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్ నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లలో కంటెంట్ అందించనున్నట్లు వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రసారాలు టి-సాట్ నిపుణ ఛానల్ లో సోమవారం సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల వరకు, మరుసటి రోజు ఉదయం విద్య ఛానల్ లో ఐదు నుండి ఏడు గంటల వరకు రెండు గంటల చొప్పున నాలుగు పాఠ్యాంశ భాగాలు ప్రసారమౌతాయని సీఈవో వివరించారు.

గ్రూప్-3 పోటీ పరీక్షలకు మరో రెండు గంటలు అదనం..

తెలంగాణ పబ్లి్క్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నవంబర్ 17వ తేదీన జరిగే 1388 గ్రూప్-3 పోస్టుల పోటీ పరీక్షలకు పోటీ పరీక్షల కంటెంట్ ను మరో రెండు గంటలు అదనంగా అందించనున్నామని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు రెండు గంటల కంటెంట్ ప్రసారం చేస్తుండగా అక్టోబర్ 21వ తేది నుండి నవంబర్ 16వ తేది వరకు 27 రోజుల పాటు ప్రతి రోజు నాలుగు గంటల పాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు. గంట నిడివిగల 108 గంటల కంటెంట్ ను నిపుణ లో సాయంత్రం ఏడు గంటల నుండి 11 గంటల వరకు, విద్యలో ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు మరియు రాత్రి ఎనిమిది నుండి 10 గంటల వరకు ప్రసారం చేస్తున్నట్లు సీఈవో వేణుగోపాల్ రెడ్డి వివరించారు. ఈ అవకాశాన్ని పోటీ పరీక్షలకు హాజరయ్యే యువత సద్వినియోగపరుచుకోవాలని సూచించారు.

Read Also: Delhi : అప్పటి అండర్ వరల్డ్ ముంబయి లా ఢిల్లీ పరిస్థితి మారింది: సీఎం అతిశీ