Dying Declarations – Caution : మరణ వాంగ్మూలం.. ఎవరైనా చనిపోయేటప్పుడు చెప్పే చివరి మాటలు! వీటికి చట్టం దృష్టిలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.. ప్రత్యేకించి ఆస్తిపాస్తుల విభజన.. హక్కుల బదిలీ.. నేర ఘటనలు వంటి అంశాల్లో మరణ వాంగ్మూలానికి చాలా ప్రయారిటీ ఉంటుంది. ఇటువంటి కీలకమైన ‘మరణ వాంగ్మూలం’పై సుప్రీంకోర్టు బెంచ్ ముఖ్యమైన కామెంట్స్ చేసింది.మరణ వాంగ్మూలం అనేది విశ్వసించేలా, నమ్మకం కలిగించేలా ఉండాలని స్పష్టం చేసింది.ఒకవేళ మరణ వాంగ్మూలంపై అనుమానం వస్తే.. దాన్ని కేవలం ఓ సాక్ష్యంగా పరిగణించాలని నిర్దేశించింది.ఈనేపథ్యంలో మరణ వాంగ్మూలం కీలకంగా మారిన ఒక కేసులో.. ఉరిశిక్ష పడిన ఒక నిందితుడిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
Also read : Pragyan Rover Moon Walk : చందమామపై చిట్టి ‘ప్రజ్ఞాన్’ బుడిబుడి అడుగులు.. వీడియో వైరల్
మొదటి భార్య కుమారుడు, ఇద్దరు సోదరులు నిద్రపోతుండగా..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన నిందితుడు ఇర్ఫాన్‌కు 2017లో ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. తన మొదటి భార్య కుమారుడు, ఇద్దరు సోదరులు నిద్రపోతున్న గదికి నిప్పటించి.. వారిని హత్య చేశాడన్న ఆరోపణలతో పోలీసులు ఇర్ఫాన్ ను అరెస్ట్ చేశారు. ఆస్పత్రిలో చనిపోయే ముందు కుటుంబసభ్యులు ఇచ్చిన మరణవాంగ్మూలం ఆధారంగా స్థానిక కోర్టు ఇర్ఫాన్ కు మరణశిక్ష విధించింది. తన రెండో పెళ్లికి.. మొదటి భార్య కుమారుడు, ఇద్దరు సోదరులు అడ్డుగోడలా నిలబడ్డారన్న కారణంతో ఇంటికి ఇర్ఫాన్ నిప్పంటించాడని నిర్ధారించిన ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును నిందితుడు ఇర్ఫాన్ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశాడు. అక్కడ కూడా ఇర్ఫాన్ కు ఊరట దక్కలేదు. దీంతో అతడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.
Also read : Chandrayaan3: శభాష్ భరత్.. ఇడ్లీలు అమ్మి, చంద్రయాన్ 3లో భాగమై!
చనిపోయే ముందు నిజమే చెబుతాడన్న గ్యారంటీ లేదని..
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ప్రశాంత కుమార్ మిశాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేదు. చనిపోయే దశలో ఉన్న ఇర్ఫాన్ ఇద్దరు సోదరులిచ్చిన వాంగ్మూలాలపై అనుమానం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం.. చనిపోయే ముందు వ్యక్తి కచ్చితంగా నిజమే చెబుతాడన్న గ్యారంటీ లేదని అభిప్రాయపడింది. వ్యక్తులు చివరి దశలో ఇచ్చే వాంగ్మూలాల్లో నిజానిజాలను న్యాయస్థానాలు మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని (Dying Declarations – Caution) స్పష్టం చేసింది. ఉరిశిక్ష పడిన నిందితుడ్ని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.