Gachibowli Land Case : నేడు సుప్రీంకోర్టులో హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా? లేదా? స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. 1996 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు.
Read Also: AI Powered Media Company : ఏఐ పవర్డ్ మీడియా కంపెనీ పెట్టబోతున్న దిల్ రాజు
అయితే అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని.. దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ చెప్పారు. 2004 నుంచి ఈ భూముల వ్యవహారం, కోర్టుల్లో ఉన్న పరిస్థితి.. ఆ తర్వాత చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి తదితర వివరాలను అభిషేక్ మను సింఘ్వీ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది.
రూ.10వేల కోట్లకు మార్టిగేజ్ చేశారని సీఈసీ నివేదికలో చెప్పిందని అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ భూములను మార్టిగేజ్ చేశారా.. అమ్ముకున్నారా? అనేది తమకు అనవసరమని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. చెట్లు కొట్టివేసే ముందు అనుమతి ఉందా? లేదా? అనేది మాత్రమే ముఖ్యమని చెప్పారు. కేంద్ర సాధికార కమిటీ దాఖలు చేసిన నివేదికకు ప్రతిస్పందనగా అఫిడవిట్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది. అవి ప్రభుత్వ భూములు అని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏ సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇదివరకే కౌంటర్ దాఖలు చేసింది.
కాగా, ఇటీవల సుప్రీంకోర్టు 400 ఎకరాలు భూములకు సంబంధించిన పిటిషన్లపై విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం అవి అటవీ భూములా, అందులో జంతువులు ఉన్నాయా అనే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు.. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆ 400 ఎకరాల ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది.
Read Also: Sravan Rao : నాలుగోసారి సిట్ విచారణకు హాజరైన శ్రవణ్‌రావు