Jharkhand: సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్(Hemant Soren)కు ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఈడీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. ఈ సందర్బంగా హేమంత్ సోరెన్‌కు జార్ఖ్ండ్ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులోని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం సమర్థించింది.
భూకుంభకోణంలో మని లాండరింగ్ అంశంలో ఆరోపణలు నేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈ ఏడాది జనవరిలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఆయన బిర్సా ముండా జైల్లో ఉన్నారు. ఆ క్రమంలో ఆయన బెయిల్ కోసం పలుమార్లు కోర్టులను సైతం ఆశ్రయించారు. కానీ బెయిల్ మాత్రం హేమంత్ సోరెన్‌కు లభించ లేదు. అయితే ఇటీవల ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం రాజధాని రాంచిలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ ఓటమి లక్ష్యంగా పని చేయాలని వారికి పిలుపు నిచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవికి చంపయ్ సోరెన్ రాజీనామా చేశారు. దాంతో హేమంత్ సోరెన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఆయన కేబినెట్‌లో చంపయి సోరెన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.